For Money

Business News

బ్రాండెడ్‌ కంపెనీల చేతిలో సగం వాటా

ఈ ఏడాది ఏడు ప్రధాన నగరాల్లో మొత్తం హౌసింగ్‌ సేల్స్‌ 3.6 లక్షల యూనిట్లకు చేరుతాయని ప్రాపర్టీ కన్సల్టింగ్‌ కంపెనీ అనరాక్‌ కన్సల్టెంట్స్‌ పేర్కొంది. వీటిలో 50 శాతం వాటా బ్రాండెడ్‌ కంపెనీలదేనని పేర్కొంది. 2014లో 3.43 లక్షల యూనిట్లను అమ్మారని, ఈ ఏడాది ఆ రికార్డును దాటనున్నట్లు అనరాక్‌ ఛైర్మన్‌ అనూజ్‌ పూరి తెలిపారు.
అందులో 50 శాతానికి పైగా అమ్మకాల వాటాను బ్రాండెడ్‌ (‘ఏ’ గ్రేడ్‌) డెవలపర్లే చేజిక్కించుకోవచ్చని తాజా నివేదికలో పేర్కొంది. ప్రధాన నగరాల జాబితాలో ఢిల్లీ-ఎన్‌సీఆర్‌, ముంబై మెట్రో రీజియన్‌(ఎంఎంఆర్‌), చెన్నై, కోల్‌కతా, బెంగళూరు, హైదరాబాద్‌, పుణె ఉన్నాయి. లిస్టెడ్‌ రియల్టీ కంపెనీలు, దశాబ్దానికి పైగా కాలంగా కార్యకలాపాలు సాగిస్తున్న డెవలపర్లు, బడా వ్యాపార సామ్రాజ్యాలు కొత్తగా ఏర్పాటు చేసిన రియల్టీ కంపెనీలతో పాటు భారీ స్థాయిలో నిర్మాణాలు చేపడుతున్న సంస్థలను ఏ గ్రేడ్‌ డెవలపర్ల జాబితాలో చేర్చినట్లు ఆయన వెల్లడించారు. రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌ ట్రెండ్‌ గురించి అనూజ్‌ పూరీ మాట్లాడుతూ ఏ గ్రేడ్‌ డెవలపర్లు నిర్మిస్తున్న ప్రాజెక్టులపైనే వినియోగదారులు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారని తెలిపారు. ఈ ఏడాది జనవరి-సెప్టెంబరు కాలంలో కొత్తగా ప్రారంభమైన 2.65 లక్షల యూనిట్ల గృహ ప్రాజెక్టు ల్లో దాదాపు 60 శాతం బ్రాండెడ్‌ డెవలపర్లవేనని పేర్కొన్నారు. సకాలంలో ప్రాజెక్టు పూర్తి చేస్తారన్న నమ్మకంతో బడా, బ్రాండెడ్‌, విశ్వసనీయ డెవలపర్ల ప్రాజెక్టుల్లో గృహ కొనుగోలుకే వినియోగదారులు అధికంగా మొగ్గు చూపుతున్నారని తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరం అధిక సేల్స్‌ బుకింగ్స్‌ లభించిన లిస్టెడ్‌ రియల్టీ కంపెనీల్లో ప్రెస్టీజ్‌ ఎస్టేట్స్‌, మాక్రోటెక్‌ డెవలపర్స్‌ (గతంలో లోధా గ్రూప్‌), గోద్రేజ్‌ ప్రాపర్టీస్‌, డీఎల్‌ఎఫ్‌ ముందున్నాయని అనూజ్‌ పూరీ తెలిపారు.