For Money

Business News

కన్జూమర్‌ లోన్స్‌పై కఠిన ఆంక్షలు

బ్యాంకులు, నాన్‌ బ్యాంకింగ్ ఫైనాన్స్‌ కంపెనీలు ఇస్తున్న అన్‌ సెక్యూర్డ్‌ లోన్లు జోరుగా పెరుగుతుండటంతో భారత రిజర్వు బ్యాంకు కీలక నిర్ణయం తీసుకుంది. సెక్యూరిటీ లేకుండా ఇస్తున్న రుణాలపై మరిన్ని ఆంక్షలు విధించింది. ఇప్పటి వరకు ఇలాంటి రుణాలు ఇవ్వాలంటే…దీనికి సరిపడా వంద శాతం నిధులను పక్కన బెట్టాల్సి వచ్చేది. ఇపుడు దీన్ని 125 శాతానికి ఆర్బీఐ పెంచింది. దీంతో అన్‌ సెక్యూర్డ్‌ రుణాలు ఇవ్వాలంటే బ్యాంకులు మరో 25 శాతం అధిక మొత్తం రిజర్వ్‌ చేయాల్సి ఉంటుంది. అయితే ఇంటి రుణాలతో పాటు విద్య కోసం ఇస్తున్న రుణాల విషయంలో ఈ ఆంక్షలు విధించడం లేదని పేర్కొంది. అలాగే వాహన రుణాలతో పాటు బంగారం, బంగారు ఆభరణాలు తాకట్టు పెట్టుకుని ఇచ్చే ఇతర రుణాలకూ ఈ కూడా రిస్క్‌ వెయిట్‌ వర్తించదని ఆర్బీఐ పేర్కొంది.
గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది రుణాల వృద్ధి రేటు సగటున 12 నుంచి 14 శాతం పెరిగాయి. అయితే అన్‌ సెక్యూర్డ్‌ రుణాలు 23 శాతం పెరగడంతో ఆర్బీఐ నిబంధనలను మరింత కఠినం చేసింది. రుణాల మంజూరు విషయంలో తమ అంతర్గత నిఘా వ్యవస్థను మరింత పటిష్ఠం చేసుకోవాల్సిందిగా బ్యాంకులకు, ఎన్‌బీఎఫ్‌సీలకు ఆర్బీఐ హెచ్చరిక చేసింది.
బ్యాంకు షేర్లకు నష్టాలు
ఇవాళ ఉదయం నుంచి ఉవ్వెత్తున పెరిగిన బ్యాంకు షేర్లు ట్రేడింగ్ చివర్లో భారీ నష్టాలతో ముగిశాయి. ఒకదశలో 44,420 పాయింట్ల స్థాయిని తాకిన బ్యాంక్‌ నిఫ్టి చివర్లో 40 పాయింట్ల నష్టంతో 44161 పాయింట్ల వద్ద ముగిసింది. ఆర్బీఐ జరిమానా విధించడంతో యాక్సిస్‌ బ్యాంక్‌ షేర్‌ 1.47 శాతం క్షీణించింది. ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్‌తో పాటు ఫెడరల్‌ బ్యాంక్‌ షేర్లు నష్టాలతో ముగిశాయి.