For Money

Business News

రతన్‌ టాటా ఇక లేరు

టాటా సామ్రాజ్య అధినేత, టాటా సన్స్‌ గౌరవ ఛైర్మన్‌ రతన్‌ టాటా (86) కన్నుమూశారు. ముంబైలోని బ్రీచ్‌ క్యాండీ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ నిన్న రాత్రి 11.30 గంటలకు తుదిశ్వాస విడిచారు. తీవ్ర అస్వస్థతతో ఆయన సోమవారం బ్రీచ్‌క్యాండీ హాస్పిటల్‌లో చేరారు. కేవలం వైద్య పరీక్షలు చేయించుకునేందుకు వెళ్లినట్లు రతన్‌ టాటా పేరుతో ఓ మీడియా ప్రకటన వచ్చింది. అయితే ఆయన నిన్న రాత్రి మృతి చెందారు. 1937 డిసెంబర్‌ 28న ముంబైలో నావల్‌ టాటా- సోనీ టాటా దంపతులకు రతన్‌ టాటా జన్మించారు. 1962లో కార్నెల్‌ యూనివర్సిటీ నుంచి డిగ్రీ పట్టా పొందిన ఆయన తరవాత పలు కంపెనీల్లో పనిచేశారు. తరవాత టాటా గ్రూప్‌లో చేరారు. తొలుత టాటా స్టీల్‌ సంస్థలో షాప్‌ ఫ్లోర్‌లో ఉద్యోగిగా పనిచేశారు. 1971లో నేషనల్‌ రేడియో, ఎలక్ట్రానిక్స్‌ కంపెనీ లిమిటెడ్‌ డైరెక్టర్‌ ఇన్‌ఛార్జిగా బాధ్యతలు చేపట్టారు. ఇక 1991లో జేఆర్‌డీ టాటా నుంచి టాటా సన్స్‌ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. ఆయన నేతృత్వంలో టాటా గ్రూప్‌ అత్యున్నత స్థాయికి చేరింది. 1990 నుంచి 2012 వరకు టాటా గ్రూప్‌నకు ఛైర్మన్‌గా ఉన్న రతన్‌ టాటా జాగ్వర్‌ ల్యాండ్‌ రోవర్‌, బ్రిటన్‌లో టాటా కంపెనీల టేకోవర్‌తో గ్రూప్‌ అంతర్జాతీయ కంపెనీగా మార్చారు. 2000లో రతన్‌ టాటా సేవలను గుర్తిస్తూ భారత ప్రభుత్వం మూడో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మభూషణ్‌ను, 2008లో రెండో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మవిభూషణ్‌ను ప్రకటించింది.