సాక్షి నుంచి రాణి రెడ్డి ఔట్!

సాక్షి మీడియా సంస్థలకు అనధికార ఎడిటర్‌గా చెలామణి అవుతున్న బండి రాణి రెడ్డిని రాజీనామా చేయమని ఆ సంస్థ యాజమాన్యం కోరింది. సాక్షి దినపత్రికతో పాటు టీవీ ఛానల్‌లో అంతా తానై వ్యవహరిస్తున్న రాణి రెడ్డి వ్యవహార శైలిపై కొన్ని నెలలుగా సంస్థలో తీవ్ర అసంతృప్తి నెలకొంది. సిబ్బంది కూడా గ్రూప్‌లుగా విడిపోయారు. ఒకరిపై మరొకరు తీవ్ర ఆరోపణలతో కరపత్రాలు వేసుకుని సోషల్ మీడియాలో హల్‌చల్ చేశారు. దీంతో సంస్థ పరువు బజారున పడటంతో సాక్షి యాజమాన్యం రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. సాక్షి పత్రిక యజమాని వైఎస్ భారతీ రెడ్డికి అత్యంత సన్నిహితురాలిగా పేరుండటంతో ఆమె వ్యవహారశైలిపై ఫిర్యాదు చేసేందుకు సీనియర్లు జంకారు. అయితే పరిస్థితి చేయిదాటి పోతోందని యాజమాన్యం కూడా గ్రహించిందని వార్తలు రావడంతో… కొందరు భారతీ రెడ్డి వద్ద రాణిరెడ్డి గురించి ప్రస్తావించినట్లు తెలుస్తోంది. సాక్షి దినపత్రిక, సాక్షి టీవీ ప్రారంభం నుంచి రాణి రెడ్డి అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నారు. బెంగళూరులోని బీపీఎల్ సంస్థలో ఉద్యోగినిగా ఉన్న రాణి రెడ్డి ఓ అండ్ ఎం అనే అంతర్జాతీయ అడ్వర్టయిజింగ్ సంస్థలోకి మారిన తరవాత కెరీర్‌లో కీలక మలుపు తిరిగింది. వివిధ మీడియా సంస్థలకు అత్యంత సన్నిహితంగా ఉన్న రాణిరెడ్డికి సాక్షిలో యాజమాన్యం ప్రధాన భూమిక ఇచ్చారు. దీంతో ఆరంభం నుంచి ఆమె సాక్షిలోని కీలక వ్యక్తుల్లో ఒకరిగా మారారు. ఆమె ప్రస్తుతం జగతి పబ్లికేషన్స్, ఇందిర టెలివిజన్ కంపెనీల డైరెక్టర్‌గా ఉన్నారు. కంపెనీ నిబంధనల ప్రకారం రెండు నెలల నోటీసును బండి రాణి రెడ్డికి ఇచ్చినట్లు తెలుస్తోంది. అనధికారికంగా ఆమెను వెళ్ళిపొమ్మని చెప్పినట్లు సాక్షి వర్గాలు అంటున్నాయి. 2006 నుంచి హైదరాబాద్‌లో ఉంటున్న రాణిరెడ్డి 2008లో సాక్షిలో చేరారు. తొలుత హోల్‌టైమ్ డైరెక్టర్‌గా ఉన్న ఆమె ప్రస్తుతం సాక్షిలో కార్పొరేట్ అఫైర్స్ డైరెక్టర్‌గా ఉన్నారు. హెచ్‌ఆర్, కార్పొరేట్ కమ్యూనికేషన్స్‌తో పాటు ఐటీ రంగాన్ని ఆమె చూస్తున్నారు. అయితే గత ఏడాది ఏపీలో వైకాపా ప్రభుత్వం ఓటమి తరవాత… సాక్షిలో ఆమెకు యాజమాన్యం అత్యధిక ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఆమె సాక్షి మీడియా సంస్థల్లో తిరుగులేని శక్తిగా మారారని, నిజానికి అనధికారిక ఎడిటర్‌గా మారాని సిబ్బంది అంటున్నారు. సాక్షి దినపత్రికలో ధనుంజయ్ రెడ్డి కీలక బాధ్యతలు చేపట్టినా… రాణిరెడ్డి దెబ్బకు ఆయన ఏమీ చేయలేకపోయారని తెలుస్తోంది. సిబ్బంది మధ్య తగాదాలు తీవ్రస్థాయి చేరడంతో పరిస్థితి చేయిదాటిపోతోందని గ్రహించిన యాజమాన్యం రాణిరెడ్డికి ఉద్వాసన పలకాలని నిర్ణయించింది. అయితే తాజా పరిమాణాలను సిబ్బంది గమనిస్తున్నారు. ఎందుకంటే సాక్షి యాజమాన్యం ఎపుడు ఏ నిర్ణయం తీసుకుంటుందో తెలియదని… మళ్ళీ రాణిరెడ్డిని తీసుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదని కొందరు అంటున్నారు. ప్రస్తుతానికి రాణి రెడ్డి వైదొలగడంతో… సాక్షి వ్యవహారాలు ఇక ఏ మలుపు తిరుగుతాయో చూడాల్సి ఉంది.