మన కన్నా మార్కెట్ చాలా తెలివైనది
రాకేష్ ఝున్‌ఝున్‌వాలా. మార్కెట్ అతన్ని బిగ్ బుల్ అంటుంది. కాని తాను సంపాదించింది షేర్లు అమ్మేనని అంటారు రాకేష్. తాను బాగా సంపాదించింది… హర్షద్ మెహతా స్కామ్ సమయంలోనే అని చెబుతాడు ఆయన. పైగా అదే సమయంలో ఇన్వెస్టర్లు భయంతో షేర్లను అమ్మేస్తుంటే… తాను రూ. 30 కోట్ల నుంచి రూ. 35 కోట్ల వరకు పెట్టుబడి పెట్టానని అంటాడు. అందుకే రాకేష్ ఫార్ములా ఒకటే… అందరూ అమ్మేస్తున్నపుడు కొనండి.. అందరూ కొంటున్నపుడు అమ్మండి అని. అయితే మోడీ వచ్చిన తరవాత రాకేష్‌ను బిగ్‌బుల్‌గా మార్చేసింది మార్కెట్. అప్పటి వరకు బిగ్ బుల్ నెట్‌వర్త్ రూ.6000 కోట్లు లోపే. ఇపుడు రూ.45,000 కోట్ల పైనే. మోడీ వచ్చాక కేవలం ఏడాదిలో ఆయన నెట్‌వర్త్ రెట్టింపు అయింది. ఆ తరవాత 2018లో 3000 కోట్ల డాలర్లకు వెళ్ళిన నెట్‌వర్త్ 2020లో కరోనా సమయంలో తగ్గింది. నిజానికి తన జీవితంలో అద్భుత పెట్టుబడి అవకాశం 2020 ఏప్రిల్‌లో వచ్చిందంటారు రాకేష్. ఆ సమయంలో చాలా భారీగా పెట్టుబడి పెట్టారు. దీంతో 2022కల్లా ఆయన పెట్టుబడి రెట్టింపు అయింది. డే ట్రేడింగ్‌కు దూరంగా ఉండే రాకేష్.. దీర్ఘ కాలిక ఇన్వెస్ట్మెంట్ ఎప్పటికీ శ్రేయస్కరం అంటాడు. ఏడాదికి 18 శాతం ప్రతిఫలం సాధించానంటే… రాజునేనని అంటాడు. 21 శాతం ప్రతిఫలం సాధించానంటే చక్రవర్తినేనని అంటాడు. రూ. 5000 పెట్టుబడితో షేర్ మార్కెట్లో ప్రవేశించిన రాకేష్ తన ట్రేడింగ్ అనుభవాన్ని టీవీ ఛానల్స్‌లో పలు సందర్భాల్లో పేర్కొన్నారు. అందులో నుంచి కొన్ని మాటలు..
– మార్కెట్ పతాక స్థాయిలో, పతనం స్థాయిలో భిన్నంగా ట్రేడ్ చేయండి. అంటే నిఫ్టి పరుగులు పెడుతూ.. అనామక ఇన్వెస్టర్లు కూడా పెట్టుబడి పెట్టే సమయంలో అమ్మండి. అదే పతనంలో సీనియర్ ఇన్వెస్టర్లు కూడా పెట్టుబడికి భయపడుతున్న సమయంలో కొనుగోలు చేయండి.
– గెలవాలన్న తపన లేకుంటే విజయం సాధించలేరు
– ఎపుడు ఇన్వెస్టర్ల కంటే స్టాక్ మార్కెట్ చాలా హేతుబద్ధంగా ఉంటుంది. మార్కెట్ కంటే స్మార్ట్‌గా ఇన్వెస్టర్ ఎన్నడూ వ్యవహరించలేడు.
– స్టాక్ మార్కెట్లో భారీ లాభాలు రావాలంటే ఆ షేర్‌ను చాలా తక్కువ ధరకు కొని ఉండాలి.
-2020 ఏప్రిల్‌లో అంటే కరోనా సమయంలో అందరూ అమ్ముతుంటే… నేను భారీగా పెట్టుబడి పెట్టాను. ఫార్మా, స్టీల్, బ్యాంకుల్లో ఇన్వెస్ట్ చేశాను.
-1986లో నేను తొలిసారి భారీ లాభాలు సాధించాను. టాటా టీ షేర్‌ను రూ. 143లకు అమ్మగా రూ. 5 లక్షలు వచ్చాయి. కారణం ఆ షేర్‌ను నేను రూ.43 వద్ద కొనడం.
-నేను చాలా తప్పులు చేశాను. కాని నా విజయాలకు చాలా పబ్లిసిటీ వచ్చింది.
-అసాధ్యమనేది మూర్ఖుల భావన
-బాగా పాపులర్ ఉన్న వ్యాపారం లాభదాయకం కాకపోవచ్చు. ఈ విషయాన్ని ఇన్వెస్టర్లు గమనించాలి. బిజినెస్ టు కస్టమర్స్ కాదు.. బిజినెస్ టు బిజినెస్ వ్యాపారం చేసే కంపెనీల్లో పెట్టుబడి పెట్టండి. బిజినెస్ టు బిజినెస్ అంటే మరో వ్యాపార సంస్థకు తన ఉత్పత్తులను అమ్మే కంపెనీ అన్నమాట.
-మార్కెట్ ట్రెండ్‌ను గౌరవించండి. నష్టాలు వస్తే వాటిని స్వీకరించడం నేర్చుకోండి.
– ఎపుడూ మార్కెట్ నిర్ణయం సరైనది. దానితో పోటీ పడకండి.
– మీరు పెట్టుబడి పెట్టేది భవిష్యత్ వ్యాపార అవకాశాలను చూసి. భవిష్యత్తులో ఏమైనా జరగొచ్చు. ఒకస్థాయికి మించి భవిష్యత్తును మీరు అంచనా వేయలేరు.
– హేతుబద్ధ వ్యాల్యూయేషన్ లేని షేర్లలో పెట్టుబడి పెట్టొద్దు. పదిమంది కొంటున్నారు కదా అని.. ఆ షేర్ వెంట పరుగులు పెట్టొద్దు.
– మార్కెట్‌ను..మరణాన్ని.. వాతావరణాన్ని పసిగట్టడం చాలా కష్టం.
-సంక్షోభంలో నుంచే వృద్ధి సాధ్యం.. అంతా సజావుగా ఉన్నపుడు కాదు.
-మార్కెట్ ఎపుడూ కొనేవారు అధికంగా ఉన్నప్పుడే పెరగదు. అమ్మేవారు లేనపుడు పెరుగుతుంది.
-నాకు తప్పులంటే భయం లేదు. అయితే తప్పును భరించే శక్తి నాకు ఉందా లేదా అని చూసుకుంటాను. కాబట్టి తప్పులు జరుగుతుంటాయి. అయితే అవి మనం భరించే స్థాయిలో ఉండేలా చూసుకోవడం ముఖ్యం.
-తప్పుల నుంచి నేర్చుకోండి. నష్టాలను భరించండి.
ఇక జీవితం గురించి…
-ప్రపంచంలోని సంపద మొత్తం ఓ వ్యక్తి చేతిలోకి రావొచ్చు. కాని ఆరోగ్యానికి మించిన ఆస్తి లేదు.
– నా సంగతే చూడండి. నాకు ఇపుడు 50 ఏళ్ళు. రోజుకు 25 సిగరెట్లు కాలుస్తాను. రోజు ఆరు పెగ్గుల విస్కీ తాగుతాను. పందిలా తింటాను. ఎలాంటి వ్యాయామం చేయను. కాబట్టి నా ఆయువు పరిమితంగానే ఉంటుంది.
(2012లో ఓ టీవీ ఛానల్‌తో అన్న మాటలు)
– గడచిన 25 ఏళ్ళు రేయింబగళ్ళు డబ్బు సంపాదించడానికి కష్టపడ్డాను. అది ఇపుడు నన్నేం చేయగలుగుతోంది. పోనీ..ఆ డబ్బుతో నేను ఏం చేయగలను? ఒక స్థాయి దాటాక ఆ డబ్బుతో మా పిల్లలకు కూడా ఏం ప్రయోజనం?
– హిందీలో ఓ సామెత ఉంది.. జర జమీన్ ఔర్ జాయదాత్.. హర్ ఝగడే కా జడ్ హై. అన్ని గొడవలకు కారణం.. మరింత భూమి.. మరింత సంపద కోసం తాపత్రయ పడటమే. అత్యాశే అనర్థాలకు మూలం.