పబ్లిక్ ఆఫర్‌కు సిద్ధమౌతున్న ఫోన్ పే
వాల్‌మార్ట్‌కు చెందిన ఫోన్ పే క్యాపిటల్ మార్కెట్లో ప్రవేశించాలని భావిస్తోంది. ఈ మేరకు త్వరలోనే బ్యాంకర్లు, లీగల్ కన్సల్టెంట్లను నియమించే అవకాశముందని పీటీఐ వార్తా సంస్థ పేర్కొంది. ఫోన్ పేను ఫ్లిప్‌కార్ట్ మాజీ ఉద్యోగులైన సమీర్ నిగమ్, రాహుల్ చారీ, బుర్జిన్ ఇంజినీర్ నెలకొల్పారు. దీన్ని 2016లో ఫ్లిప్‌కార్ట్ కొనుగోలు చేసింది. 2018లో ఫ్లిప్‌కార్ట్‌ను మొత్తంగా వాల్‌మార్ట్ కొనుగోలు చేయడంతో… ఫేస్‌పే కూడా వాల్‌మార్ట్ చేతికి వచ్చింది. మరింత విస్తరణ కోసం పబ్లిక్ ఆఫర్ ద్వారా నిధులు సమీకరించాలని ఫోన్ పే భావిస్తోంది. కంపెనీ వ్యాల్యూయేషన్ 800 కోట్లు లేదా 1000 కోట్ల డాలర్లుగా అంచనా వేస్తోంది. అంటే గరిష్ఠ స్థాయిలో దీని వాల్యూషన్ రూ. 78,000 కోట్లు అన్నమాట. ప్రస్తుతం ఫోన్ పే మాతృసంస్థ సింగపూర్లోఉంది. దీన్ని ఇండియాకు మార్చాలన్న ప్రతిపాదనకు కంపెనీ బోర్డు ఆమోదం తెలిపింది. ఫోన్ పే తన ప్రధాన వ్యాపారం లాభదాయకంగా మారాక పబ్లిక్ ఆఫర్ రావాలని భావిస్తోంది. కంపెనీ అంచనాల ప్రకారం 2023 నాటికి అంటే వచ్చే ఏడాదికల్లా కంపెనీ లాభాల్లోకి వస్తుంది. సో… ఐపీఓ మార్కెట్లోకి రావడానికి కూడా వచ్చే ఏడాది పడుతుందన్నమాట. మ్యూచువల్ ఫండ్, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ (ఎన్బీఐఎప్సీ) లైసెన్స్ కోసం కంపెనీ దరఖాస్తు చేసుకుంది. యూపీఐ లావాదేవీల్లో ప్రస్తుతం ఫోన్ పేదే అగ్రస్థానం. నెలవారీ యూపీఐ లావాదేవీల్లో ఈ కంపెనీదే 47 శాతం వాటా. పైగా ఇటీవలే ఈ కంపెనీ వెల్త్ డెస్క్, ఓపెన్ క్యూ, గిగ్ఇండియా అనే మూడు కంపెనీలను టేకోవర్ చేసింది. బంగారంలో యూపీఐ ఆధారిత ఎస్ఐపీ (సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్) ప్రారంభిస్తామని ఫోన్ పే ఇప్పటికే ప్రకటించింది.