For Money

Business News

ఇన్వెస్టర్లకు జాక్‌పాట్‌

బంగారం ధరలతో పాటు ఈ రంగంలో ఉన్న షేర్లకు ఈ ఏడాది జాక్‌పాట్‌ అని చెప్పొచ్చు. దాదాపు అన్ని కంపెనీల షేర్లు 52 వారాల గరిష్ఠ స్థాయిని తాకాయి. తాజాగా ఈజాబితాలో పీసీ జువెలర్స్‌ కూడా చేరింది. కంపెనీ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోవడం, బ్యాంకులు దివాలా పిటీషన్‌ వేయడంతో ఈ కంపెనీ షేర్‌ రూ. 25.45కు పడిపోయింది. అక్కడి నుంచి కంపెనీ షేర్‌ క్రమంగా పెరుగుతూ వచ్చింది. ఇవాళ రూ. 161.77ని తాకింది. ఇవాళ కూడా కంపెనీ అప్పర్‌ సర్క్యూట్‌లో ముగిసింది. ఈనెల 30వ తేదీన కంపెనీ షేర్ల విభజన గురించి చర్చించనున్నట్లు కంపెనీ వెల్లడించింది. ప్రస్తుతం ఈ షేర్‌ ముఖ విలువ రూ. 10. మరి షేర్‌ ముఖ విలువను రూ.5కు మారుస్తారా లేదా రూ.2గా మారుస్తారా అన్నది తెలియడం లేదు. 30న తెలుస్తుంది. ఈలోగా కంపెనీ ఇన్వెస్టర్లకు మరో గోల్డన్‌ న్యూస్‌ వచ్చింది. బకాయి పడిన రుణాలకు సంబంధించి బ్యాంకులతో కంపెనీ ఓ ఒప్పందానికి వచ్చింది. ీ మేరకు వన్‌ టైమ్‌ సెటిల్‌మెంట్‌ (ఓటీఎస్‌) ఒప్పందం కుదిరినట్లు కంపెనీ స్టాక్‌ ఎక్స్ఛేంజీలకు తెలిపింది. ఓటీఎస్‌లో భాగంగా నగదుతో పాటు ఈక్విటీని రుణదాతలకు ఇవ్వనున్నట్లు కంపెనీ పేర్కొంది. కంపెనీపై 14 బ్యాంకులు దావా వేశాయి. ఇపుడు ఈ దావాలను బ్యాంకులు ఉపసంహరించుకోనున్నాయి. మరి పీసీ జువల్లర్స్‌ షేర్‌ దీనికి ఎలా స్పందిస్తుందో చూడాలి. ఇందులో ర్యాలీ ఎందాకో చూడాలి.