For Money

Business News

మరో 450 ప్యారడైజ్‌ రెస్టారెంట్లు

హైదరాబాద్‌ బిర్యానీకి మారుపేరుగా మారిన ప్యారడైజ్‌ రెస్టారెంట్‌ భారీ విస్తరణకు సిద్ధమవుతోంది. ఇటీవల వరంగల్‌, ఏలూరు, విజయనగరం, రాజమండ్రి, కర్నూలు, హైదరాబాద్‌లలో కొత్త రెస్టారెంట్లను ఏర్పాటు చేసింది. వచ్చే ఐదేళ్లలో దేశ, విదేశాల్లో కొత్తగా 450 రెస్టారెంట్లు ఏర్పాటు చేయాలని కంపెనీ భావిస్తోంది. ఇందుకు అవసరమైన రూ.2,000 కోట్ల పెట్టుబడి అవసరమౌతుందని కంపెనీ భావిస్తోంది. ఇందులో 75 శాతం మొత్తం అంతర్గత వనరుల ద్వారా సమకూర్చుకోనున్నట్టు ప్యారడైజ్‌ ఫుడ్‌కోర్ట్స్‌ కంపెనీ సీఈఓ గౌతమ్‌ గుప్తా చెప్పారు. ఈ ఏడాది చివరి నాటికల్లా కొత్తగా 50 రెస్టారెంట్లు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన వెల్లడించారు. 2024కల్లా ఉత్తర అమెరికా, ఐరోపా, పశ్చిమ, ఆగ్నేయాసియా దేశాల్లోనూ రెస్టారెంట్లు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని అన్నారు.
మరో అయిదేళ్ళలో 500 రెస్టారెంట్లు నెలకొల్పాలని నిర్ణయించామని, ఇందులో 100 రెస్టారెంట్లు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో ఏర్పాటు చేయాలని ప్యారడైజ్‌ భావిస్తోంది. తరవాత తమిళనాడు, కేరళ, కర్ణాటకల్లో 100 రెస్టారెంట్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం ఆరు రాష్ట్రాల్లోని 13 నగరాల్లో ‘ప్యారడైజ్‌ ఫుడ్‌ కోర్ట్స్‌’ పేరుతో 50 రెస్టారెంట్లు నిర్వహిస్తోంది.