For Money

Business News

ప్రపంచ మార్కెట్లలో భయం.. భయం

కరోనా తొలిసారి దాడి చేసినప్పటి ఫీలింగ్‌ ఇపుడు మార్కెట్‌లో కన్పిస్తోంది. దాదాపు అన్ని రకాల మార్కెట్లు కుప్పకూలుతున్నాయి. శాస్త్రవేత్తలకు కూడా కరోనా కొత్త వేరియంట్‌పై స్పష్టమైన అవగాహన పూర్తి స్థాయి పరీక్షలు లేకపోవడంతో అన్ని మార్కెట్లను భయం వెంటాడుతోంది. మార్కెట్‌ రూల్స్‌ను చెత్తబుట్టలో పడేశారు. సాధారణంగా డాలర్‌ పడితే మెటల్స్‌, ఆయిల్‌ పెరగాలి. కాని అన్ని మార్కెట్లు భారీగా పతనం అవుతున్నాయి. ఉదయం ఆసియా, మధ్యాహ్నం యూరో, ఇపుడు అమెరికా మార్కెట్లు … ఏ మార్కెట్‌ చూసినా ఒకటే అమ్మకాలు. యూరో మార్కెట్‌ నష్టాలు నాలుగు శాతం దాకా ఉన్నాయి. అమెరికాలో కూడా ఒత్తిడి అధికంగా ఉంది. డాలర్‌ 0.7 శాతం పడితే… క్రూడ్‌ ఆయిల్‌ 8 శాతంపైగా పడింది. కరోనా దెబ్బకు మళ్ళీ లాక్‌ డౌన్‌ ఖాయమని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయిల్‌పై ఎక్కడ లేని ఒత్తిడి వస్తోంది. బంగారం క్రితం స్థాయి వద్ద ఉండేగాని… వెండి కూడా క్షీణిస్తోంది. పారిశ్రామికరంగం నుంచి వెండి డిమాండ్‌ తగ్గవచ్చనే వార్తలు బులియన్‌పై పడుతోంది. వీటన్నింటికి భిన్నంగా ఉండే క్రిప్టో కరెన్సీలలో కూడా అమ్మకాల జోరు కన్పిస్తోంది. దాదాపు అన్ని ప్రధాన క్రిప్టో కరెన్సీలు నష్టాల్లో ఉన్నాయి. బిట్‌ కాయిన్‌, ఎథీరియం, బినాన్స్‌ కాయిన్‌, సొలానా… ఇలా అన్నీ ఏడు శాతం నుంచి పది శాతం దాకా నష్టంతో ట్రేడవుతున్నాయి. మార్కెట్లకు రేపు, ఎల్లుండి సెలవు కావడంతో మార్కెట్‌లో భయం పెరుగుతోంది. రేపు, ఎల్లుండి కొత్త కేసులు నమోదైతే సోమవారం ఇదే భయం కొనసాగే అవకాశముంది. రిస్క్‌ వద్దనుకునే ఇన్వెస్టర్లందరూ అమ్మకాలకు పాల్పడుతున్నారు.