ఓలెక్ట్రా గ్రీన్‌టెక్ నికర లాభం రూ. 19 కోట్లు
జూన్‌తో ముగిసిన మొదటి త్రైమాసికానికి ఎలక్ట్రిక్ మొబిలిటీ కంపెనీ, మెగా గ్రూప్ కంపెనీ అయిన ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ రూ.305 కోట్ల స్టాండ్ఎలోన్ ఆదాయాన్ని ఆర్జించింది. గత ఏడాది ఇదే కాలంలో కంపెనీ ఆర్జించిన ఆదాయం రూ.41.2 కోట్లు. అంటే టర్నోవర్ 640 శాతం పెరిగిందన్నమాట. ఇదే కాలానికి నికర లాభం కూడా 825 శాతం పెరిగి రూ.2 కోట్ల నుంచి రూ.19 కోట్లకు చేరింది. తొలి త్రైమాసికంలో 169 ఎలక్ట్రిక్ బస్సులను డెలివరీ చేయడం వల్ల ఆదాయం పెరిగిందని కంపెనీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కేవీ ప్రదీప్ తెలిపారు. కంపెనీలో ఈ-బస్, ఇన్సులేటర్ డివిజన్లు ఉన్నాయి. ఈ-బస్ విభాగం జూన్ త్రైమాసికానికి రూ.279 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. పూణే బస్ కార్యకలాపాల నుండి అధిక నిర్వహణ ఆదాయం వచ్చినట్లు ప్రదీప్ తెలిపారు. ఇన్సులేటర్ డివిజన్ ఆదాయం రూ. 25.3 కోట్లకు పెరిగింది. రానున్న త్రైమాసికాలలో కొత్త ఉత్పత్తి శ్రేణిని పరిచయం చేయడంతో పాటు మరిన్ని విభాగాల్లోకి ప్రవేశిస్తామని ఆయన అన్నారు.