For Money

Business News

సోనీ- జీ డీల్‌పై అభ్యంతరం

జీ ఎంటర్‌టైన్మెంట్‌, సోనీ పిక్చర్‌ నెట్‌వర్క్స్‌ ఇండియా విలీనంపై కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ డీల్‌ వల్ల దేశీయంగా మీడియా పరిశ్రమలో పోటీపై ప్రభావం చూపే అవకాశముందని సీసీఐ పేర్కొంది. ఈ డీల్‌ను మరింత లోతుగా పరిశీలించాల్సి ఉందని సీసీఐ అభిప్రాయపడినట్లు రాయిటర్స్‌ వార్తా సంస్థ పేర్కొంది. రెండు కంపెనీల విలీనం తరవాత కొత్తగా ఏర్పడే కంపెనీకి దాదాపు గుత్తాధిపత్యం వచ్చే అవకాశముందని.. దీనివల్ల ఛానల్స్‌ ధరలను పెంచడంతో పాటు లాభాలను పెంచుకునే అవకాశముందని సీసీఐ పేర్కొంది.ఈ మేరకు ఆగస్టు 3వ తేదీన కంపెనీ లేఖ రాసినట్లు తెలుస్తోంది. నాలుగు విభాగాల్లో ఈ రెండు ఛానల్స్‌కు చెందిన 2020-21 ఆర్థిక సంవత్సరం మార్కెట్‌ డేటాను చూసిన తరవాత ఈ అభిప్రాయానికి వచ్చినట్లు సీసీఐ పేర్కొంది. హిందీ జనరల్ ఎంటర్‌టైన్మెంట్ ఛానల్‌, హిందీ ఫిలిమ్స్‌, బెంగాలీ జీఈసీ, మరాఠీ జీఈసీ మార్కెట్‌లో ఈ రెండు కంపెనీల మార్కెట్‌ వాటా 40 శాతంపైగా ఉందని సీసీఐ పేర్కొంది. అయితే మరింత పరిశోధన తరవాత సీసీఐ నుంచి తమ విలీన ప్రతిపాదనకు ఆమోదం లభిస్తుందని తాము భావిస్తున్నట్లు జీ, సోనీ తెలిపాయి.