బీపీసీఎల్ ప్రైవేటీకరణ వెనక్కి
భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (బీపీసీఎల్) డిజిన్వెస్మెంట్ ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం విరమించుకుంది. ఇపుడు ప్రతిపాదించిన పద్ధతిలో కాకుండా మరో మార్గంలో ఈ కంపెనీలో వాటా విక్రయించే ఆలోచన చేస్తోంది. అంతర్జాతీయ ఇంధన మార్కెట్లో నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల కారణంగా బీపీసీఎల్ ప్రైవేటీకరణ పక్రియలో పాల్గొనేందుకు మెజారిటీ బిడ్డర్లు అనాసక్తి చూపించడమే ఇందుకు కారణమని ప్రభుత్వం తెలిపింది. బీపీసీఎల్‌లో కేంద్రానికి ఉన్న మొత్తం 52.98 శాతం వాటాను అమ్మేందుకు ప్రభుత్వం గతంలో బిడ్లు ఆహ్వానించింది. ఎవరూ పెద్దగా ఆసక్తి చూపలేదు. వేదాంత గ్రూప్ ఛైర్మన్ అనిల్ అగర్వాల్ కూడా బాహాటంతో బీపీసీఎల్ ప్రైవేటీకరణ సక్సెస్ కాదన్నారు. మూడే బిడ్స్ రావడంతో ప్రభుత్వం తన ప్రయత్నాలను విరమించుకుంది. ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ఆయిల్ పరిశ్రమపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడింది. దీంతో బీపీసీఎల్ ప్రస్తుత డిజిన్వెస్ట్‌మెంట్ ప్రక్రియను కొనసాగించేందుకు నిస్సహాయత వ్యక్తం చేసినట్టు డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ (దీపం) వివరించింది. ఈ నేపథ్యంలో బీపీసీఎల్ వ్యూహాత్మక విక్రయానికి ఇప్పుడు అమలు జరుగుతున్న ఈవోఐ ప్రక్రియను నిలిపివేయాలని డిజిన్వెస్ట్‌మెంట్ మంత్రుల గ్రూప్ నిర్ణయించింది.