మార్గదర్శిపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దు
మార్గదర్శి చిట్ ఫండ్ సంస్థపై ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని ఏపీ చిట్ రిజిస్ట్రార్లను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశించింది. సంస్థకు చెందిన కొన్ని శాఖల్లో వివరాలు కోరుతూ రిజిస్ట్రార్లు డిసెంబరు 20న ఇచ్చిన నోటీసుకు.. మార్గదర్శి సంస్థ నాలుగు వారాల్లో సమాధానం ఇవ్వాలని సూచించింది. సమాధానం అందుకున్న తర్వాత చట్టాన్ని రిజిస్ట్రార్లు తప్పనిసరిగా పాటించాలని పేర్కొంది అప్పటి వరకు పిటిషనర్ సంస్థలపై ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవడానికి వీల్లేదని ఆదేశించింది. మార్గదర్శి వేసిన అనుబంధ పిటిషన్లను పెండింగ్‌లోనే ఉంచిన కోర్టు… విచారణను సంక్రాంతి సెలవుల తర్వాతకు వాయిదా వేసింది. ఈలోగా మార్గదర్శి వేసిన ప్రధాన పిటీషన్‌లో కౌంటర్ వేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సత్తి సుబ్బారెడ్డి నిన్న ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. హైదరాబాద్ ప్రధాన కార్యాలయంపై జరిపిన దాడుల విషయంలో ఏపీ అధికారుల చర్యలపై హైదరాబాద్ హైకోర్టు స్టే ఇచ్చిన విషయం తెలిసిందే.
ఫిర్యాదుల్లేవ్…
మార్గదర్శి చిట్ సంస్థ గడచిన 60 ఏళ్ళలో అవకతవకలకు పాల్పడినట్లు కానీ, ఖాతాదారులకు సొమ్ము ఎగవేసినట్లుగానీ తమకు ఫిర్యాదులు అందలేదని ఏపీ అధికారులే అంగీకరిస్తున్న విషయాన్ని రాష్ట్ర హైకోర్టు ఈ సందర్భంగా గుర్తుచేసింది. చిట్ ప్రారంభానికి ముందే చిట్ మొత్తానికి ఫోర్‌మన్ 50 శాతం సొమ్మును రిజిస్ట్రార్ వద్ద, మిగిలిన 50 శాతం సొమ్ముకు బ్యాంకు గ్యారంటీ రూపంలో మార్గదర్శి సంస్థ సెక్యూరిటీగా ఇస్తున్న విషయాన్ని కూడా పేర్కొంది. ఈ నేపథ్యంలో మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వకపోతే పిటిషనర్ సంస్థకు పూడ్చుకోలేని నష్టం జరుగుతుందని కోర్టు వ్యాఖ్యానించింది. కంపెనీ బ్యాంక్ బ్యాలెన్స్ మొత్తం రూ.2,816 కోట్లు ఉండగా.. ఖాతాదారులకు చెల్లించాల్సిన మొత్తం రూ.580 కోట్లు మాత్రమేనని మార్గదర్శి తన పిటీషన్‌లో తెలిపింది.