చెలరేగిపోయిన బుల్స్
నెస్లే ఇండియా మినహా నిఫ్టిలోని 49 షేర్లు ఇవాళ లాభాల్లో ముగిశాయంటే… మార్కెట్ మూడ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. రెండు గంటల వరకు ఒక మోస్తరు లాభాలకే పరిమితమైన నిఫ్టి ఆ తరవాత చెలరేగిపోయింది. సెప్టెంబర్ నెల తొలి డెరివేటివ్స్ వారం భారీ లాభాల్లో ముగిసింది. కేవలం గంటన్నరలో నిఫ్టి 400 పాయింట్లు దాకా పెరిగి బేర్ ఆపరేటర్స్‌ను కోలుకోలేని దెబ్బ కొట్టింది. నిఫ్టి దూకుడుతో బుల్ ఆపరేటర్లు ఇవాళ పండుగ చేసుకున్నారు. ముఖ్యంగా తాజా కొనుగోళ్ళకు షార్ట్ కవరింగ్ తోడు కావడంతో అనేక షేర్లు ఆకర్షణీయ లాభాలతో ముగిశాయి. ముఖ్యంగా ఐటీ, బ్యాంకింగ్ షేర్లు చెలరేగిపోయాయి. దీంతో నిఫ్టి ఏకంగా 471 పాయింట్ల లాభంతో 25388 వద్ద ముగిసింది. సెన్సెక్స్ కూడా 1439 పాయింట్ల లాభంతో 82962 వద్ద ముగిసింది. దాదాపు రంగాల షేర్ల సూచీలు ఇవాళ ఒక శాతం నుంచి రెండు శాతం వరకు లాభాలతో ముగిశాయి. ఇవాళ నిఫ్టి ఆరంభంలో 24941ని తాకింది అక్కడి నుంచి మిడ్‌సెషన్ వరకు గ్రీన్‌లో ఉన్నా… పరిమిత లాభంతో ఉంది. రెండు గంటల తరవాత 25000 స్థాయి నుంచి దూసుకెళ్ళి 25433 పాయింట్ల స్థాయిని తాకింది. దాదాపు గరిష్ఠ స్థాయి వద్దే నిఫ్టి 25388 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టి షేర్లలో ఇవాళ హిందాల్కో 4 శాతంపైగా లాభంతో క్లోజైంది. భారతీ ఎయిర్‌టెల్, ఎన్‌టీపీసీ, శ్రీరామ్ ఫైనాన్స్, గ్రాసిం టాప్ గెయినర్స్‌లో ఉన్నాయి. నిఫ్టి నెక్ట్స్‌లో జొమాటో నాలుగు శాతంపైగా లాభపడి టాప్ గెయినర్‌గా నిలిచింది. ఇక మిడ్‌క్యాప్ సూచీలో అరబిందో ఫార్మా, పేజ్ ఇండస్ట్రీస్ టాప్ గెయినర్స్‌గా నిలిచాయి. బ్యాంక్ నిఫ్టిలో కొటక్ బ్యాంక్, ఎస్‌బీఐ రెండు శాతంపైగా లాభంతో క్లోజయ్యాయి.