For Money

Business News

నిఫ్టికి చైనా దెబ్బ

ఒకదశలో అమెరికా మార్కెట్లను కూడా ఖాతరు చేయని భారత మార్కెట్లకు చైనా నుంచి గట్టి దెబ్బ తగిలింది. గత జనవరి నుంచి తమ మార్కెట్లను కావాలని కూల్చిన చైనా… ఒక్కసారిగా మార్కెట్‌కు మద్దతుగా నిలిచింది. గత వారం నుంచి అనేక విధాన పరమైన నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యంగా వడ్డీ రేట్లను తగ్గించడం, మరింత కరెన్సీని మార్కెట్‌లోకి తేవడంతో ఒక్కసారి చైనా మార్కెట్లు పరుగులు లంఘించుకున్నాయి. చైనా, హాంగ్‌కాంగ్‌ మార్కెట్లు ఈఏడాది ఎన్నడూ లేనివిధంగా పెరిగాయి. ప్రతి రోజూ నాలుగు నుంచి అయిదు రోజుల పాటు పెరిగాయి. దీంతో విదేశీ ఇన్వెస్టర్లు చైనా మార్కెట్లపై తరలి అవకాశాలు అధికమయ్యాయి. గత శుక్రవారం భారీ అమ్మకాలు చేసిన విదేశీ ఇన్వెస్టర్లు ఇవాళ కూడా అమ్మకాలకు పాల్పడినట్లు తెలుస్తోంది. మొత్తానికి చైనా సెంటిమెంట్‌ మార్కెట్‌పై తీవ్రంగా పడింది. ఇప్పటికే ఆల్‌ టైమ్‌ గరిష్ఠ స్థాయికి చేరి… పడటానికి ఏదో ఒక సాకు వెతుతున్న మార్కెట్‌కు.. చైనా వార్తలు బాగా కలిసి వచ్చాయి. దీంతో ఉదయం నుంచే నిష్టి పడుతూ వచ్చింది. గత శుక్రవారం ప్రారంభమైన అక్టోబర్‌ సిరీస్‌ రెండో రోజు భారీ నష్టాలు నమోదు అయ్యాయి. మార్కెట్‌ ఏ దశలోనూ కోలుకునే ప్రయత్నం చేయలేదు. 25794 పాయింట్ల కనిష్ఠ స్థాయికి చేరిన నిఫ్టి… 25810 పాయింట్ల వద్ద ముగిసింది. అంటే దాదాపు కనిష్ఠ స్థాయి వద్దే ముగిసింది. ఒక్క మెటల్స్‌ మినహా మిగిలిన రంగాల నుంచి నిఫ్టి ఏకోశాన మద్దతు లభించలేదు. దీంతో నిఫ్టి, సెన్సెక్స్‌ ఏకంగా ఒకటిన్నర శాతం నష్టంతో ముగిశాయి. నిఫ్టి 368 పాయింట్లు నష్టపోగా, సెన్సెక్స్‌ 1,272 పాయింట్ల నష్టంతో ముగిసింది. స్మాల్‌, మిడ్‌ క్యాప్‌ షేర్లలో ఒత్తిడి అధికంగా ఉంది. బ్యాంక్‌, ఫైనాన్షియల్‌ రంగ సూచీలు ఒకటిన్నర శాతంపైగా నష్టపోయాయి. నిఫ్టి షేర్లలో మెటల్‌ షేర్లు భారీగా లబ్ది పొందాయి. జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ ఏకంగా 3 శాతం లాభపడింది. అలాగే ఎన్‌టీపీసీ, హిందాల్కో, బ్రిటానియా, టాటా స్టీల్‌షేర్లు టాప్‌ గెయినర్స్‌లో అగ్రభాగాన ఉన్నాయి. ఇక నష్టపోయిన షేర్లలో హీరో మోటొకార్ప్‌ నాలుగు శాతంపైగా నష్టపోయింది. యాక్సిస్‌ బ్యాంక్‌, ట్రెంట్‌, రిలయన్స్‌, బీఈఎల్‌ షేర్లు మూడు శాతంపైగా నష్టంతో ముగిశాయి.

Leave a Reply