నిఫ్టి పైకి… షేర్లు కిందకి…
ఇవాళ మార్కెట్లో పరిస్థితి దాదాపు ఇలానే ఉంది. కేవలం ఇండెక్స్ ప్రధాన షేర్ల ధరలను పెంచి.. ఇతర షేర్లలో భారీ అమ్మకాలు చేశారు. నిఫ్టి గ్రీన్‌లో ముగిసినా దాదాపు అన్ని ప్రధాన సూచీలు నష్టాల్లో ముగిశాయి. మారుతీ, రిలయన్స్ షేర్లకు నిఫ్టికి అధిక వెయిటేజీ ఉంది. ఈ షేర్లతో పాటు మరికొన్ని షేర్ల ధరలను పెంచడంతో ఒకదశలో నష్టాల్లోకి వెళ్ళిన నిఫ్టి.. క్లోజింగ్‌లో 17,786 వద్ద ముగిసింది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 50 పాయింట్లు పెరిగింది. ఉదయం 17838 పాయింట్ల గరిష్ఠ స్థాయిని తాకిన నిఫ్టి మిడ్ సెషన్ తరవాత బాగా బలహీనపడింది. యూరో మార్కెట్లు దాదాపు ఒక శాతం వరకు నష్టపోవడంతో నిఫ్టి 17723 పాయింట్లకు పడిపోయింది. చివర్లో నిఫ్టి కోలుకున్నా.. నిఫ్టి నెక్ట్స్, నిఫ్టి మిడ్ క్యాప్‌తో పాటు నిఫ్టి బ్యాంక్ సూచీలు కూడా భారీ నష్టాల్లో ముగిశాయి. గత కొన్ని రోజులుగా నిఫ్టికి అండగా ఉన్న నిఫ్టి బ్యాంక్ ఇవాళ 0.75 శాతం నష్టపోయింది. ఎస్బీఐ కార్డ్స్, నైకా షేర్లు 5 శాతంపైగా నష్టపోయాయి. రెస్టారెంట్లు జొమాటొకు గుడ్‌బై చెపుతున్నారన్న వార్తతో ఆ కంపెనీ షేర్ మూడున్నర శాతం క్షీణించింది. గత కొన్నిరోజులుగా మార్కెట్ డార్లింగ్‌గా పేరొందిన పర్సిస్టెంట్ సిస్టమ్స్ ఇవాళ 4 శాతం క్షీణించింది. ఫలితాలు ఆశాజనకంగా లేకపోవడంతో లారస్ ల్యాబ్‌లో అమ్మకాల ఒత్తిడి కొనసాగుతోంది. ఇవాళ ఈ షేర్ 3 శాతం క్షీణించింది. ఇక దివీస్ ల్యాబ్ కూడా రెండు శాతం తగ్గింది. నిన్న భారీగా పెరిగిన రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ ఇవాళ ఆరు శాతం క్షీణించింది.