గ్రీన్ యూరోతో నిఫ్టి రికవరి
ఇవాళ ఒక మోస్తరు నష్టాల నుంచి నిఫ్టి కోలుకుంది. దాదాపు 50 రోజుల చలన సగటు దాకా వెళ్ళిన నిఫ్టికి 17,600 ప్రాంతంలో మద్దతు లభించింది. ఈ స్థాయిని బ్రేక్ చేస్తే నిఫ్టి 17,545 పాయింట్ల వద్ద మద్దతు ఉందని అనలిస్టులు అంటున్నారు. మిడ్ సెషన్ వరకు నష్టాల్లో ఉన్న నిఫ్టి… యూరో మార్కెట్ల రికవరీతో కోలుకుంది. ఒకదశలో గ్రీన్‌లోకి వెళ్ళి 17,781 పాయింట్లను తాకింది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 37 పాయింట్ల నష్టంతో 17,711 పాయింట్ల వద్ద ముగిసింది. ప్రైవేట్ కంపెనీల్లో భారీ అమ్మకాల ఒత్తిడి వస్తోంది. ఫైనాన్షియల్ సూచీ ఒక శాతం దాకా నష్టపోగా, బ్యాంక్ నిఫ్టి, నిఫ్టి నెక్ట్స్ అర శాతం నష్టంతో ముగిశాయి. కేవలం మిడ్ క్యాప్ నిఫ్టి మాత్రమే ఒక శాతం లాభంతో ముగిసింది. ఇవాళ నిఫ్టిని కేవలం పీఎస్‌యూ షేర్లు ఆదుకున్నాయి. ఐటీ షేర్లలో ఒత్తిడి కాస్త తగ్గింది. అయితే చాలా రోజుల తరవాత హెచ్డీఎఫ్సీ బలహీనంగా కన్పించింది.