కోలుకున్నా… నష్టాల్లోనే నిఫ్టి
అంతర్జాతీయ మార్కెట్లతో పోలిస్తే మన మార్కెట్లు ఒక మోస్తరు నష్టాలతో ముగిశాయి. శుక్రవారం నష్టాల తరవాత కూడా అమెరికా మార్కెట్ల ఫ్యూచర్స్ ఇవాళ 1.6 శాతంపైగా నష్టంతో ట్రేడవుతున్నాయి. ఇక యూరో మార్కెట్ల నష్టాలు ఒకటిన్నర శాతం నుంచి రెండు శాతం దాకా నష్టాల్లో ఉన్నాయి. యూరో స్టాక్స్ 50 సూచీ 1.5 శాతం నష్టంతో ఉంది. అయినా మన మార్కెట్లు కేవలం 0.67 శాతం నష్టంతో ముగిశాయి. మిడ్ సెషన్‌కల్లా క్రితం ముగింపు స్థాయికి వచ్చినా.. తరవాత వచ్చిన అమ్మకాల ఒత్తిడి కారణంగా నిఫ్టి భారీగా క్షీణించింది. సరిగ్గా క్లోజింగ్ ముందు మళ్ళీ 16400 దాకా వచ్చిన నిఫ్టి చివర్లో 16301 వద్ద ముగిసింది. క్రితం మగింపుతో పోలిస్తే 109 పాయింట్లు నష్టపోయింది. సెన్సెక్స్ 364 పాయింట్ల నష్టంతో ముగిసింది. పవర్‌గ్రిడ్ ఇవాళ్టి టాప్ గెయినర్ కాగా, రిలయన్స్ టాప్ లూజర్స్. కంపెనీ ఫలితాలు నిరాశాజనకంగా ఉండటంతో రిలయన్స్ కౌంటర్‌లో భారీ ఒత్తిడి వచ్చింది. అంతర్జాతీయ మార్కెట్లు భారీ నష్టాల్లో ఉన్నా, డాలర్‌తో రూపాయి బలహీనంగా ఉన్నా.. మన మార్కెట్లు తక్కువ నష్టాలతో ముగియడానికి కారణం ఎల్‌ఐసీ పబ్లిక్ ఆఫర్ సబ్‌స్క్రయిప్షన్స్‌కు చివరి రోజు కావడమేనని మార్కెట్ వర్గాలు అంటున్నారు. రేపటి నుంచి అసలు మజా ఉంటుందని వీరు హెచ్చరిస్తున్నారు.