భారీ నష్టాల్లో నిఫ్టి
అమెరికా వడ్డీ రేట్ల భయంతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు మరోసారి కుంగాయి.నిన్న రాత్రి అమెరికా కన్జూమర్ ప్రైస్ ఇండెక్స్ భారీగా పెరగడంతో వాల్‌స్ట్రీట్ కుప్పకూలింది. ఈనెలలో వడ్డీ రేట్లను 0.75 శాతం పెంచడం ఖాయమని మెజారిటీ విశ్లేషకులు భావించడంతో నాస్డాక్ 5.16 శాతం, ఎస్ అండ్ పీ 4.32 శాతం, డౌజోన్స్ 3.94 శాతం చొప్పున నష్టపోయాయి.ఆసియా మార్కెట్లు కూడా రెండు శాతం నష్టంతో ట్రేడవుతున్నాయి. ఈ నేపథ్యంలో నిఫ్టి దాదాపు 300 పాయింట్ల నష్టంతో ప్రారంభమైంది. ఇపుడు కోలుకుని 17868 పాయింట్ల వద్ద 201 పాయింట్ల నష్టంతో ట్రేడవుతోంది. ఇవాళ ఐటీ కౌంటర్లలో భారీ అమ్మకాల ఒత్తిడి వచ్చింది. గత కొన్ని రోజుల లాభాలు ఒక్కరోజులో పోయాయి. నిఫ్టిలో టాప్ ఫైవ్ లూజర్స్ అన్నీ ఐటీ కంపెనీలే. ఇన్ఫోసిస్, టీసీఎస్, టెక్ మహీంద్రా షేర్లు మూడు శాతంపైగా నష్టపోగా, హెసీఎల్ టెక్, విప్రో షేర్లు రెండున్నర శాతంపైగా నష్టపోయాయి. ఇతర ప్రధాన సూచీలన్నీ నష్టాల్లో ఉన్నాయి. అమెరికా, ఆసియా మార్కెట్ల పతనంతో పోలిస్తే… మన మార్కెట్లలో నష్టాలు తక్కువే అని చెప్పాలి. అయితే యూరో మార్కెట్ల తరవాత ట్రెండ్‌లో మార్పు రావచ్చు. నిఫ్టి మళ్ళీ ఉదయం కనిష్ఠ స్థాయి 17771ని తాకుంతుందేమో చూడాలి.