25,000 దిశగా నిఫ్టి

ఒక్కసారిగా అంతర్జాతీయ పరిణామాలు సానుకూలంగా మారడంతో భారత మార్కెట్లు దూసుకుపోతున్నాయి. దేశీయ మార్కెట్ పరిస్థితులు సానుకూలంగా ఉండటంతో వాల్‌స్ట్రీట్ నష్టాలను నిఫ్టి పట్టించుకోలేదు. అయితే అమెరికా ఫెడ్ ఛైర్మన్ జొరొమ్ పామెల్‌ను తొలగించాలన్న డిమాండ్ విషయంలో ట్రంప్ వెనక్కి తగ్గడంతో వాల్‌స్ట్రీట్ భారీ లాభాల్లో ముగిసింది. అమెరికా తమ సంబంధాలు బాగున్నాయన్న ట్రంప్ స్టేట్‌మెంట్‌తో మార్కెట్ సెంటిమెంట్ మరింత మెరుగుపడింది. దీంతో చెత్త ఫలితాలను ప్రకటించినా… టెస్లా షేర్ 5 శాతం లాభంతో ముగిసింది. ఫ్యూచర్స్‌లో కూడా ఈ షేర్ మరో 5 శాతం పెరిగింది. 1.5 శాతం లాభంతో అమెరికా ఫ్యూచర్స్ ట్రేడవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆసియా మార్కెట్లు కూడా ఆకర్షణీయ లాభాలతో ట్రేడవుతున్నాయి. ప్రస్తుత సానుకూల పరిస్థితుల్లో నిఫ్టి 25,000 దిశగా పయనం ప్రారంభించింది. తక్షణం 24,700 స్థాయిని నిఫ్టి క్రాస్ చేసేలా ఉంది. ముఖ్యంగా రేపు ఏప్రిల్ నెల డెరివేటివ్స్ క్లోజింగ్ ఉండటంతో అనేక షేర్లలో భారీ షార్ట్ కవరింగ్‌కు ఛాన్స్ ఉంది. మరోవైపు బ్యాంక్ నిఫ్టి ఇవాళ మరో కొత్త రికార్డు సృష్టించేందుకు రెడీగా ఉంది.