స్థిరంగా ప్రారంభం కానున్న నిఫ్టి
శుక్రవారం అమెరికా మార్కెట్లు గ్రీన్‌లో ముగిసినా.. అమెరికా జాబ్ డేటా ప్రపంచ మార్కెట్లను పునరాలోచనలో పడేసింది. మార్కెట్ అంచనాలకు భిన్నంగా నాన్ ఫామ్ పే రోల్స్ గత నెలలో భారీగా పెరిగాయి. దీంతో మార్చి నెలలో 0.25 శాతం బదులు 0.5 శాతం చొప్పున ఫెడ్ వడ్డీ రేట్లను పెంచుతుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. డాలర్‌తో పాటు బాండ్ ఈల్డ్స్ పెరగడంతో షేర్ మార్కెట్‌పై ఒత్తిడి పెరుగుతోంది. ఆసియా మార్కెట్లు అపుడే నష్టాల్లోకి జారుకున్నాయి. అమెరికా ఫ్యూచర్స్ కూడా రెడ్‌లో ఉన్నాయి. వారం రోజుల సెలవుల తరవాత ఇవాళ చైనా మార్కెట్లు ఇవాళ తెరచుకున్నాయి. శుక్రవారం నుంచి హాంగ్‌కాంగ్ మార్కెట్ పనిచేస్తోంది. చైనా మార్కెట్లను మినహాయిస్తే హాంగ్‌కాంగ్‌తో సహా పలు కీలక మార్కెట్లు నష్టాల్లో ఉన్నాయి. హాంగ్‌సెంగ్ 0.73శాతం, కోప్సి 0.96 శాతం, జపాన్ నిక్కీ, 0.91 శాతం నష్టంతో ట్రేడవుతున్నాయి. సింగపూర్ నిఫ్టి 44 పాయింట్ల నష్టంతో ట్రేడవుతోంది. సో… నిఫ్టి స్వల్ప నష్టంతో లేదా స్థిరంగా ప్రారంభమయ్యే అవకాశాలు అధికంగా ఉన్నాయి.