మొత్తం లాభాలు పోయే!
గత రెండు వారాల నుంచి మార్కెట్‌ను ఊరిస్తూ వచ్చిన జీఎస్టీ 2.0 వెర్షన్ తుస్సుమంది. రెండు రోజులు సాగాల్సిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఒక్క రోజులోనే ముగించి… రాత్రి పది గంటలకు ప్రెస్ మీట్ మరీ పెట్టి కౌన్సిల్ నిర్ణయాలను కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. దీనికి స్పందనగా గిఫ్ట్ నిఫ్టి 150 పాయింట్ల దాకా పెరిగింది. ఉదయం నిఫ్టి ఆరంభంలోనే 24,980 పాయింట్లను తాకింది. 25000 స్థాయి కోసం ఎదురు చూస్తున్న ఇన్వెస్టర్లకు మార్కెట్ షాక్ ఇచ్చింది. అక్కడి నుంచి పడుతూ వచ్చి.. ట్రేడింగ్‌కు ముందు నష్టాల్లోకి జారుకుంది. 24708 పాయింట్ల కనిష్ఠ స్థాయిని తాకిన తరవాత 24,734 వద్ద ముగిసింది. ఇన్వెస్టర్ల ఆశలన్నీ నీరుగారి పోయాయి. జీఎస్టీ హేతబద్ధీకరణతో భారీగా లాభపడుతుందని భావించిన ఎఫ్ఎంసీజీ విభాగంగా పూర్తిగా నిరాశపర్చింది. ఉదయం 58485ని తాకిన నిఫ్టి ఎఫ్ఎంసీజీ సూచీ కూడా 1000 పాయింట్లు తగ్గి కేవలం 134 పాయింట్ల లాభంతో ముగిసింది. ఆటో సూచీ ఒక్కటే ఇవాళ 0.85 శాతం లాభంతో ముగిసింది. నిఫ్టి షేర్లలో ఎం అండ్ ఎం, బజాజ్ ఫైనాన్స్ షేర్లు మాత్రం వరుసగా 6, 4 శాతం లాభంతో ముగిశాయి. బజాజ్ ఫిన్ సర్వ్ 2 శాతం, నెస్లే, గ్రాసిమ్ కౌంటర్లు ఒక శాతంపైగా లాభంతో క్లోజయ్యాయి. ఇక నష్టపోయిన నిఫ్టి షేర్లలో హెచ్డీఎఫ్సీ లైఫ్ ముందుంది.
