ఉవ్వెత్తిన పెరిగి… ఉసూరుమంటూ..
ఉదయం ఆరంభంలో స్వల్ప ఒత్తిడికి లోనైన నిఫ్టికి క్రమంగా బలపడుతూ వచ్చింది. అమెరికా ఫ్యూచర్స్ పెరిగే కొద్దీ నిఫ్టి పెరిగింది. ఒకదశలో 15628 పాయింట్లను తాకింది నిఫ్టి. కాని అమెరికా ఫ్యూచర్స్ ఒక్కసారి నష్టాల్లోకి రావడంతో నిఫ్టిపై ఒత్తిడి పెరిగింది. ఈలోగా యూరో మార్కెట్లు ఒక శాతంపైగా నష్టంతో ప్రారంభం కావడంతో నిఫ్టి నష్టాల్లోకి జారుకుంది. వీక్లీ డెరివేటివ్స్ క్లోజింగ్ కూడా కావడంతో మార్కెట్లో ఒత్తిడి తీవ్రంగా ఉంది. వచ్చేవారంతో నెలవారీ డెరివేటిక్స్ క్లోజ్ అవుతున్నాయి. దీంతో ఈ వారం హెచ్చుతగ్గులు అధికంగా ఉన్నాయి. ఇవాళ్టి గరిష్ఠ స్థాయి నుంచి నిఫ్టి 15362ని తాకింది. అంటే ఇవాళ్టి గరిష్ఠ స్థాయి నుంచి 250 పాయింట్లకు పైగా క్షీణించింది. ఐటీ షేర్లతో పాటు ఆటో షేర్లలో ర్యాలీ కారణంగా నిఫ్టి నష్టాలు తగ్గాయని అనుకోవచ్చు. యాక్సెంచర్ ఇవాళ ఫలితాలు విడుదల చేయనుంది. దీంతో ఐటీ షేర్లలో ఆశాజనక కొనుగోళ్ళు జరుగుతున్నాయి. బ్యాంక్ షేర్లతో పాటు మెటల్ షేర్లతో ఒత్తిడి వస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లలో ట్రెండ్ చూస్తుంటే నిఫ్టిలో మరిన్ని హెచ్చుతగ్గులు ఉండే అవకాశముంది.