For Money

Business News

లాభాలన్నీ పాయే…

ఓపెనింగ్‌లో ఒక 16800 టచ్‌ కావడమే లేటు… అన్నట్లుగా ఉన్న ఉత్సాహం … ట్రేడింగ్‌ కొనసాగే కొద్దీ పోయింది. 16793 పాయింట్లను తాకిన నిఫ్టి… మిడ్‌సెషన్‌ తరవాత బలహీనపడం ప్రారంభమైంది. యూరప్‌ మార్కెట్లు నామ మాత్రపు లాభాలకే పరిమితమైంది. మరోవైపు పది శాతం ఉద్యోగాలను కట్ చేస్తానని ఎలాన్‌ మస్క్‌ చేసిన ప్రకటనతో టెస్లా షేర్‌ 3 శాతంపైగా నష్టపోయింది. దీంతో అమెరికా ఫ్యూచర్స్‌ రెడ్‌లోకి వెళ్ళిపోయింది. మన మార్కెట్‌లో కూడా లాభాల స్వీకరణతో 16,567కి అంటే 230 పాయింట్లు పడిపోయింది. చివర్లో 16584 పాయింట్ల వద్ద ముగిసింది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 44 పాయింట్లు నష్టపోగా, సెన్సెక్స్‌ 49 పాయింట్ల నష్టంతో ముగిసింది. చూడటానికి స్వల్ప నష్టాల్లోనే నిఫ్టి క్లోజైనా… నిఫ్టియేతర షేర్లలో అమ్మకాల జోరు అధికంగా ఉంది. నిఫ్టి కేవలం 0.26 శాతం నష్టపోగా.. నిఫ్టి నెక్ట్స్‌ 1.45 శాతం, నిఫ్టి మిడ్ క్యాప్‌ 1.6 శాతం, నిఫ్టి బ్యాంక్‌ 0.95 శాతం నష్టం పోయింది. అంటే కేవలం నిఫ్టిలోని షేర్లు మాత్రమే కాస్త పటిష్ఠంగా ఉన్నాయి. ఇతర షేర్లలో గట్టి అమ్మకాలు వచ్చాయన్నమాట. రిలయన్స్‌ ఒక్కటే రెండు శాతం లాభపడింది. ఇతర ఐటీ షేర్ల లాభాలు కరిగిపోయాయి. నిఫ్టిలో 11 షేర్లు గ్రీన్‌లో క్లోజ్‌ కాగా, 39 షేర్లు నష్టాల్లో ముగిశాయి. క్షీణించిన షేర్లలో టాప్‌ షేర్లు సిమెంట్‌ షేర్లే కావడం విశేషం. అల్ట్రాటెక్‌ విస్తరణ ప్రణాళిక ఆ షేర్‌తో పాటు పరిశ్రమలోని ఇతర షేర్లను భారీగా దెబ్బతీసింది.గ్రాసిం 6.5 శాతం, అల్ట్రాటెక్‌ 5.5 శాతం, శ్రీసిమెంట్ 4.6 శాతం చొప్పున నష్టపోయాయి.