For Money

Business News

స్వల్ప నష్టాలతో ముగిసిన నిఫ్టి

డెరివేటివ్స్‌ ఎఫెక్ట్‌ ఇవాళ మార్కెట్‌లో స్పష్టంగా కన్పించింది. ఉదయం పది గంటలకు సాధారణంగా చిన్న ఇన్వెస్టర్లు తమ పొజిషన్స్‌ను స్క్వేర్‌ ఆఫ్‌ చేసుకుంటారు. అదే సమయానికి నిఫ్టి ఇవాళ్టి కనిష్ఠ స్థాయి 18063ని తాకింది. అక్కడి నుంచి కోలుకున్న నిఫ్టి మిడ్‌ సెషన్‌లో ఇవాళ్టి గరిష్ఠస్థాయి 18155ని తాకింది. ఇక సెషన్‌ ముగిసేముందు మళ్ళీ డెరివేటివ్స్‌ కారణంగా నిఫ్టి మళ్ళీ భారీ నష్టపోయింది. చివరి కొద్ది నిమిషాల్లో స్వల్పంగా కోలుకుని 18,100పైన 18,107 వద్ద ముగిసింది. గ్లోబల్ మార్కెట్లతో పాటు దేశీయంగా ప్రతికూల సంకేతాలతో స్టాక్ మార్కెట్లు రోజంతా నష్టాల్లో ఉన్నా… అవి నామమాత్రమే అని చెప్పొచ్చు. నిన్న రాత్రి అమెరికా మార్కెట్లు ఒకటి నుంచి రెండు శాతం క్షీణించగా, యూరో మార్కెట్లు కూడా అదే స్థాయి నష్టాలతో ట్రేడవుతున్నాయి. యూరోస్టాక్స్‌ 50 సూచీ 1.70 శాతంపైగా నష్టపోయింది. మన మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 187.31 పాయింట్లు నష్టపోయి 60,858 వద్ద, నిఫ్టీ 57.50 పాయింట్లు క్షీణించి 18,107 వద్ద ముగిశాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో టాటా స్టీల్, పవర్‌గ్రిడ్, టెక్ మహీంద్రా, యాక్సిస్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఎల్అండ్‌టీ కంపెనీల షేర్లు టాప్‌ గెయినర్స్‌ కాగా, ఏషియన్ పెయింట్, ఇండస్ఇండ్ బ్యాంక్, టాటా మోటార్స్, కోటక్ బ్యాంక్, టైటాన్, హిందుస్థాన్ యూనిలీవర్, అల్ట్రా సిమెంట్ షేర్లు టాప్‌ లూజర్స్‌గా నిలిచాయి. ఇక నిఫ్టిలో కోల్‌ ఇండియా మూడు శాతంపైగా లాభపడగా, యూపీఎల్‌ రెండు శాతం పైగా పెరిగింది. ఇక నష్టపోయిన నిఫ్టి షేర్లలో అదానీ ఎంటర్‌ప్రైజస్‌ ఉంది. ఫాలోఆన్‌ పబ్లిక్‌ ఆఫర్‌ ప్రకటనతో ఈ షేర్‌ దాదాపు 4 శాతం క్షీణించింది. ఇక ఏషియన్‌ పెయింట్స్‌ లాభాలు నిరాశాజనకంగా ఉండటంతో ఆ కంపెనీ షేర్‌ కూడా 3 శాతంపైగా నష్టపోయింది.