For Money

Business News

అదానీ ఎంటర్‌ప్రైజస్‌ నుంచి ఎఫ్‌పీఓ

అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ ఫాలో ఆన్‌ పబ్లిక్‌ ఆఫర్‌ (ఎఫ్‌పీవో) ప్రకటించింది. మార్కెట్‌ నుంచి రూ.20,000 కోట్లు సమీకరించేందుకు ఉద్దేశించిన ఈ ఎఫ్‌పీఓ ఈనెల 27న ప్రారంభంకానుంది. అలాగే ఇష్యూ ఈనెల 31న ముగుస్తుంది. ఈ ఆఫర్‌ ద్వారా సమీకరించే నిధుల్లో రూ. 10,869 కోట్లు గ్రీన్‌ హైడ్రోజన్‌ ప్రాజెక్టులతో పాటు ప్రస్తుత ఎయిర్‌పోర్టుల విస్తరణ కోసం ఉపయోగిస్తారు. అలాగే కొత్తగా నిర్మించే ఎక్స్‌ప్రెస్‌ వే కోసం ఖర్చుచేయనున్నట్టు కంపెనీ ఆఫర్‌ లెటర్‌లో పేర్కొంది. ప్రస్తుతం కంపెనీలో ప్రమోటర్లకు 72.63 శాతం వాటా ఉండగా, ఎఫ్‌పీవోతో ఈ వాటా 3.5 శాతం మేర తగ్గుతుంది. అయితే ఈ ఆఫర్‌ కింద షేర్లను పాక్షిక చెల్లింపుల కింద అంటే పార్ట్‌లీ-పెయిడ్‌ షేర్లను కంపెనీ జారీచేస్తుంది. అంటే మొత్తం ధరను ఇపుడే చెల్లించాల్సి పనిలేదు. ఒక్కో షేరుకు రూ.3,112-3,276 ప్రైస్‌ బ్యాండ్‌తో షేర్లను ఆఫర్‌ చేస్తున్నా… రీటైల్‌ ఇన్వెస్టర్లకు షేరుకు రూ.64 డిస్కౌంట్‌ ఇస్తున్నట్టు అదానీ ఎంటర్‌ప్రైజస్‌ తెలిపింది. ఇందులో 50 శాతం మొత్తాన్ని మాత్రం ఈ ఆఫర్‌లో చెల్లిస్తే సరిపోతుంది. మిగిలిన మొత్తాన్ని ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ వాయిదాల్లో కట్టే అవకాశం ఉంటుంది. కనీసం 4 షేర్లకు, అటుపై 4 షేర్ల చొప్పున గుణకాల్లో బిడ్‌ చేయాల్సి ఉంటుంది. ఫిబ్రవరి 7నాటికి షేర్లను డీమ్యాట్‌ ఖాతాల్లో జమచేస్తామని, ఫిబ్రవరి 8 నుంచి ఈ షేర్లు ట్రేడవుతాయని పేర్కొంది. ఈ ఆఫర్‌ ప్రకటనతో ఇవాళ మార్కెట్‌ షేర్‌ దాదాపు 4 శాతం దాకా క్షీణించింది.