భారీ నష్టాల్లో ముగిసిన నిఫ్టి
ఉదయం ఒక మోస్తరు నష్టాలతో ప్రారంభమైన నిఫ్టి.. క్రమంగా మరింత బలహీనపడుతూ వచ్చింది. ప్రపంచ మార్కెట్లు నిస్తేజంగా ఉండటం, మన మార్కెట్లకు సంబంధించి పాజిటివ్ అంశాలు లేకపోవడంతో … ఇన్వెస్టర్లలో ఆసక్తి తగ్గింది. మిడ్ సెషన్లో స్వల్పంగా కోలుకునే ప్రయత్నం జరిగినా… యూరప్ మార్కెట్ నష్టాలతో మళ్ళీ క్షీణించింది. ఒకదశలో 17306 పాయింట్లను తాకిన నిఫ్టి… క్లోజింగ్‌లో 17321 వద్ద ముగిసింది. క్రితం ముగింపుతో పోలిస్తే 129 పాయింట్లు క్షీణించింది. అదానీ షేర్లు కోలుకోవడంతో నిఫ్టి నెక్ట్స్, నిఫ్టి మిడ్ క్యాప్ సూచీలు స్థిరంగా ముగిశాయి. బ్యాంక్ నిఫ్టి 0.76 శాతం క్షీణించింది. నిఫ్టి షేర్లలో అదానీ పోర్ట్స్ టాప్ గెయినర్‌గా నిలిచింది. అదానీ ఎంటర్‌ప్రైజస్ కూడా ఒక శాతంపైగా లాభపడింది. నిఫ్టిలో టాప్ గెయినర్స్‌లో టాప్ నాలుగు షేర్లు అదానీ షేర్లు కావడం విశేషం. అదానీ ట్రాన్స్, అదానీ గ్రీన్, అదానీ విల్మర్, ఎన్డీటీవీ షేర్లు అయిదు శాతం అప్పర్ సీలింగ్‌తో క్లోజ్ కాగా, అంబుజా సిమెంట్ నాలుగున్నర శాతం, అదానీ టోటల్ నాలుగు శాతం చొప్పున లాభంతో ముగిశాయి. ఏసీసీ ఒక శాతం చొప్పున లాభంతో క్లోజయ్యాయి. అదానీ గ్రూప్ షేర్లన్నీ గ్రీన్‌లో ముగియడం విశేషం.