వైరస్ వార్తల ఎఫెక్ట్…

బ్యాంకులు, కొన్ని ఎఫ్‌ఎంసీజీలకు సంబంధించిన నెగిటివ్ వార్తలకు స్పందిస్తూ నిఫ్టి ఇవాళ ఒక మోస్తరు నష్టాలతో ప్రారంభమైంది. వెంటనే నష్టాల్లోకి వెళ్ళిన నిఫ్టి కొన్ని నిమిషాల్లోనే లాభాల్లోకి వచ్చేసింది. 10.15 గంటలకు ప్రారంభమైన పతనం నిఫ్టిని దారుణంగా దెబ్బతీసింది. తొలుత బెంగళూరులో HMPV వైరస్ కేసు బయట పడటంతో పతనం జోరందుకుంది. ఈలోగా రెండో కేసు కూడా బయటపడటంతో నిఫ్టి 23600 స్థాయికి పడింది. అక్కడి నుంచి కోలుకునని ఒంటి గంటలకు 23,750కి చేరుకుంది. మార్కెట్ కుదురు కుంటున్న సమయంలో గుజరాత్‌లో మరో కేసు బయటపడింది. దీంతో నిఫ్టి మళ్ళీ క్షీణించింది. ఒకదశలో 23551 పాయింట్ల స్థాయిని తాకింది. ఆ తరవాత కోలుకున్నట్లు అనిపించినా.. ఆ రికవరీ 23616 పాయింట్ల వద్ద ముగిసింది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 388 పాయింట్ల నష్టంతో క్లోజైంది. అత్యధికంగా పీఎస్‌యూ బ్యాంకుల సూచీ నాలుగు శాతంపైగా నష్టపోయింది. బ్యాంకు నిఫ్టిలోని అన్ని షేర్లు నష్టాలతో ముగిశాయి. ఈ సూచీ కూడా రెండు శాతంపైగా నష్టపోయింది. ఐటీ, ఫార్మా మినహా మిగిలిన సూచీలు భారీ నష్టాలతో ముగిశాయి. మూడో త్రైమాసానికి సంబంధించి వివిధ కంపెనీలు ఇచ్చిన తాజా అప్‌డేట్ మార్కెట్ సెంటిమెంట్‌ను దారుణంగా దెబ్బతీశాయి. ముఖ్యంగా పీఎస్‌యూ బ్యాంకులతో పాటు ప్రైవేట్ బ్యాంకులు కూడా బాగా నష్టపోయాయి. నిఫ్టిలో ఏకంగా 43 షేర్లు నష్టాలతో ముగిశాయంటే… పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. లాభాల్లో ముగిసిన నిఫ్టి షేర్లలో అపోలో హాస్పిటల్స్ టాప్‌లో ఉంది. టాటా కన్జూమర్, టైటాన్, హెచ్‌సీఎల్ టెక్, ఐసీఐసీఐ బ్యాంక్ గ్రీన్‌లో ముగిశాయి. ఇక నష్టాల్లో ముగిసిన నిఫ్టి షేర్లలో టాటా స్టీల్ ముందుంది. ఈ షేర్ నాలుగున్నర శాతం నష్టపోయింది. ట్రెంట్, బీపీసీఎల్, ఎన్‌టీపీసీ, అదానీ ఎంటర్‌ప్రైజస్ ఆ తరవాతి స్థానాల్లో ఉన్నాయి.