For Money

Business News

17 ఏళ్ళలో తొలిసారి

స్టాక్‌ మార్కెట్‌లో ఇన్వెస్టర్ల ఉత్సాహం బ్రేకుల్లేకుండా కొనసాగుతోంది. అంతర్జాతీయ పరిణామాలను బేఖాతరు చేస్తూ నిఫ్టి ఇవాళ వరుసగా 11వ రోజు కూడా లాభాలతో ముగిసింది. ఇలా వరుసగా 11 సెషన్స్‌లో నిఫ్టి లాభాల్లో ముగియడం గత 17 ఏళ్ళలో ఇదే మొదటిసారి. నిఫ్టి చివర్లో భారీగా నష్టపోయినా.. కొన్ని నిమిషాల్లోనే అదే స్థాయిలో పుంజుకుని లాభాల్లో ముగిసింది. పైగా సూచీలు తమ జీవితకాల గరిష్ఠ స్థాయిల్లో క్లోజ్‌ కావడం కూడా మరో విశేషం. ఇవాళ నిఫ్టీ 99 పాయింట్లు, సెన్సెక్స్‌ 349 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి. నిఫ్టికి ఇవాళ టాటా మోటార్స్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, బ్రిటానియా, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, బీపీసీఎల్‌ కౌంటర్ల నుంచి గట్టి మద్దతు లభించింది. ఉదయం ఆరంభంలోనే నష్టాల్లోకి జారుకున్న నిఫ్టి… కొన్ని నిమిషాల్లోనే గ్రీన్‌లోకి వచ్చింది. మిడ్‌ సెషన్‌కల్లా 25,160 పాయింట్ల స్థాయిని దాటింది.అయితే సరిగ్గా రెండు గంటల ప్రాంతంలో నిఫ్టి దాదాపు వందకుపైగా పాయింట్లు నష్టపోయింది. 25000 పాయింట్ల దిగువకు చేరుకుని 24998 పాయింట్లను తాకింది. కాని కొన్ని నిమిసాల్లోనే షార్ట్‌ కవరింగ్‌ కారణంగా కోలుకుని ఇవాళ్టి గరిష్ఠ స్థాయి 25,192 పాయింట్ల స్థాయిని తాకింది. అంటే దాదాపు 200 పాయింట్లు కోలుకుంది. ఇవాళ ఆగస్టు డెరివేటివ్స్‌ క్లోజింగ్‌ కావడంతో నిఫ్టి కదలికల కారణంగా చిన్న ఇన్వెస్టర్లు ట్రాప్‌లో పడ్డారు. నష్టాలకు భయపడి వెంటనే అమ్మినవారు భారీగా నష్టపోయారు. కొన్ని నిమిషాల్లోనే నిఫ్టి కోలుకోవడంతో… చివరి దాకా పొజిషన్స్‌ కొనసాగించినవారి పంట పండింది. ముఖ్యంగా 25000 నిఫ్టి కాంట్రాక్ట్‌ తీవ్ర ఒడుదుడుకులకు లోనైంది. ఇవాళ రూ. 34.15 వద్ద ప్రారంభమైన ఈ కాంట్రాక్ట్‌ ఒకదశలో రూ. 75.90ని తాకింది. ఆ వెంటనే క్లోజింగ్‌ కల్లా పది పైసలకు పడిపోయింది.