For Money

Business News

దుమ్మురేపిన ఆటో, NBFCలు

ఆటో రంగం గణాంకాలు చాలా పాజిటివ్‌గా ఉండటంతో మార్కెట్‌ దశ ఒక్కసారిగా మారిపోయింది. అమెరికా ఫ్యూచర్స్‌ గ్రీన్‌లో ఉండటంతో పాటు ఆటో అమ్మకాలు బాగుండటంతో మార్కెట్‌ ఒక మోస్తరు లాభంతో ప్రారంభమైంది. వాస్తవానికి గిఫ్ట్‌ నిఫ్టి ఉదయం రెడ్‌లో ఉంది. కాని నిఫ్టి ఆరంభంలో స్వల్ప లాభాలతో ఉన్నా… ఆటో షేర్లు ఒక్కసారిగా పుంజుకున్నాయి. పైగా ఆటో బిజినెస్‌పై ప్రధానంగా ఆధార పడిన ఎన్‌బీఎఫ్‌సీ షేర్లు కూడా వాటి బాట పట్టాయి. ఇదే సమయంలో కొన్ని బ్యాంకులతో పాటు ఐటీ రంగ షేర్ల నుంచి మద్దతు రావడం, ఇవాళ నిఫ్టి వీక్లీ డెరివేటివ్స్‌ క్లోజింగ్‌ కావడంతో… అనూహ్యంగా షార్ట్‌ కవరింగ్‌ వచ్చింది. నిన్నటి వరకు డల్‌గా ఉన్న మార్కెట్‌లో షార్ట్‌ పొజిషన్స్‌ భారీగా ఉన్నాయి. ఒక్కసారి ట్రెండ్‌ మారడం, కీలక స్థాయిలను నిఫ్టి సునాయాసంగా అధిగమించడంతో నిఫ్టికి గట్టి టెక్నికల్‌ సపోర్ట్‌ కూడా లభించింది.దీంతో చాలా మంది ఆపరేటర్లు తమ షార్ట్‌ పొజిషన్స్‌ను స్క్వేర్‌ ఆఫ్‌ చేసుకోక తప్పింది. ఈ నేపథ్యంలో నిఫ్టితోపాటు దాదాపు అన్ని సూచీలు గ్రీన్‌లో ముగిశాయి. ముఖ్యంగా ఆటో సూచీ ఏకంగా నాలుగు శాతం లాభంతో ముగిసింది. ఎఫ్‌ఎంసీజీ షేర్లకు కూడా ఇవాళ మద్దతు అందింది. వెరశి సన్‌ ఫార్మా, బ్రిటానియా మినహా అన్ని నిఫ్టి షేర్లు గ్రీన్‌లో ముగిశాయి. నిఫ్టిలో అత్యధికంగా ఎస్కార్ట్స్‌ లాభపడింది. ఈ షేర్‌ ఏకంగా 8.55 శాతం లాభపడింది. ఇవాళ 1827 షేర్లు లాభాల్లో క్లోజ్‌ కాగా, 997 షేర్లు నష్టాల్లో ముగిశాయి. 149 షేర్లు ఇవాళ అప్పర్‌ సర్క్యూట్‌ను తాకాయంటే మార్కెట్‌ మూడ్‌ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. నిఫ్టి ఇవాళ 445 పాయింట్ల లాభంతో 24188 వద్ద క్లోజ్‌ కాగా, సెన్సెక్స్‌ 1436 పాయింట్ల లాభంతో ముగిసింది. సెన్సెక్స్‌ ఒకదశలో 80000 స్థాయిని క్రాస్‌ చేసింది.