సూచీలు పెరిగినా… మళ్ళీ చితక్కొట్టుడు…

సూచీలు గ్రీన్‌లో ముగిసినా చాలా షేర్లు ఇవాళ కూడా భారీ నష్టాల్లో ముగిశాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌తో పాటు ఐసీఐసీఐ బ్యాంక్, కొటక్ బ్యాంకుల కారణంగా భారీ నష్టాల నుంచి బ్యాంక్ నిఫ్టి గ్రీన్‌లోకి వచ్చింది. రెండు గంటల ప్రాంతంలో 23000 దిగువకు అంటే 22971 స్థాయికి పడిన నిఫ్టి… తరవాత కోలుకుంది.130 పాయింట్ల లాభంతో 23155 పాయింట్ల వద్ద ముగిసింది. సెన్సెక్స్ 566 పాయింట్లు పెరిగింది. కాని మెజారిటీ షేర్లు భారీగా నష్టంతో ముగిశాయి. మల్టి బ్లాగర్స్ అనుకున్న అనేక షేర్లు 35 శాతం నుంచి 50 శాతం పడ్డాయి. అయినా ఈ కౌంటర్లలో అమ్మకాల జోరు ఆగడం లేదు. ఇవాళ కూడా స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ షేర్ల సూచీ 0.80 శాతం కంటే అధిక నష్టాలతో ముగిశాయి. లార్జ్ క్యాప్‌లో కొన్ని షేర్లు మినహా చాలా వరకు షేర్లు నష్టాల్లో ముగిశాయి. ఇవాళ నిఫ్టిలో 26 షేర్లు లాభాల్లో ముగిసినా… ట్రేడైన 2894 షేర్లలో 2052 షేర్లు ఇవాళ నష్టాల్లో మునిగాయి. కేవలం పెరిగిన షేర్ల సంఖ్య 780 మాత్రమే. పైకి మార్కెట్ గ్రీన్‌లో కన్పిస్తున్నా… లోలోల నష్టాలు పేరుకుపోతున్నాయి. ఇవాళ టాప్‌గెయినర్స్ ఐటీ షేర్లు. నిఫ్టి టాప్ గెయినర్స్‌లో విప్రో, ఇన్ఫోసిస్, టీసీఎస్, టెక్ మహీంద్రా తరవాత హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఉంది. ఇక నిఫ్టి టాప్ లూజర్స్‌లో బీఈఎల్, టాటా మోటార్స్, ట్రెంట్, పవర్ గ్రిడ్, యాక్సిస్ బ్యాంక్ ఉన్నాయి.