ట్రంప్ దెబ్బకు…

పైకి ఇవాళ్టి కనిష్ఠ స్థాయి నుంచి మార్కెట్ కోలుకున్నట్లు కన్పించినా… వాస్తవానికి భారీ నష్టాలతో ముగిసింది. నిఫ్టిలోని షేర్లు కోలుకున్నాయేమోగాని.. అనేక షేర్లు నష్టాల్లో ముగిశాయి. ఇవాళ 2928 షేర్లు ట్రేడవగా, ఏకంగా 2063 షేర్లు నష్టాలతో ముగిశాయి. 191 షేర్లు లోయర్ సర్క్యూట్‌లో ముగిశాయి. ఉదయం ఆరంభమైన కొద్దిసేపటికే నిఫ్టి 23,222 పాయింట్ల కనిష్ఠ స్థాయిని తాకింది. అక్కడి నుంచి కోలుకున్నట్లు కన్పించినా… మిడ్ సెషన్‌లో మళ్ళీ పతనం తప్పలేదు. మళ్ళీ ఒంటి గంట నుంచి మార్కెట్‌కు మద్దతు లభించింది. దాదాపు ఇవాళ్టి అధిక స్థాయి వద్ద మార్కెట్ ముగిసిందనే చెప్పాలి. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 121 పాయింట్ల నష్టంతో 23,361 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టితో పాటు అనేక ప్రధాన రంగాల షేర్ల సూచీలు నష్టాతో ముగిశాయి. స్మాల్ క్యాప్ నిఫ్టి ఒకటిన్నర శాతం దాకా నష్టపోయింది. నిఫ్టిలో 35 షేర్లు నష్టాల్లో ముగిశాయి. నిఫ్టిలో ఇవాళ కూడా బజాజ్ ఫైనాన్స్ టాప్ గెయినర్‌గా నిలిచింది. ఈ షేర్ అయిదు శాతం లాభ పడి కొత్త 52 వారాల గరిష్ఠ స్థాయిని తాకింది. శ్రీరామ్ ఫైనాన్స్, ఎం అండ్ ఎం షేర్లు మూడు శాతం దాకా లాభపడ్డాయి. ఇక నిఫ్టి టాప్ లూజర్స్‌లో ఎల్ అండ్ టీ అగ్రభాగాన ఉంది. ఈ షేర్ నాలుగున్నర శాతంకన్నా అధికంగా నష్టపోయింది.