For Money

Business News

ఇవాళ ఫార్మా, మెటల్స్‌ వంతు…

ఉదయం ఊహించినట్లు నిఫ్టి 23000 దిగువకు పడింది. ఒకదశలో 22900 దిగువకు పడి రూ. 22857ని తాకినా… తరవాత కోలుకుని 22904 వద్ద ముగిసింది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 348 పాయింట్లు నష్టపోయింది. ప్రధాన సూచీల్లో ఒక్క బ్యాంక్‌ ఫైనాన్స్‌ సూచీ మాత్రమే గ్రీన్‌లో ఉంది. నిఫ్టి నెక్ట్స్‌, నిఫ్టి మిడ్‌ షేర్ల సూచీలు 3 శాతం దాకా నష్టపోయాయి. ఇవాళ ఎన్‌ఎస్‌ఈలో 2947 షేర్లు ట్రేడవగా 2230 షేర్లు నష్టాల్లో ముగియగా, 646 షేర్లు గ్రీన్‌లో క్లోజయ్యాయి. అయితే 146 షేర్లు అప్పర్‌ సర్య్యూట్‌లో క్లోజ్‌ కాగా, 108 షేర్లు లోయర్‌ సర్క్యూట్‌లో ముగిశాయి. ఇక నిఫ్టిలో టాప్‌ 5 గెయినర్స్‌లో బజాజ్‌ ఫైనాన్స్‌, టాటా కన్జూమర్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, అపోలో హాస్పిటల్స్‌ , నెస్లే షేర్లు ఉన్నాయి. ఇవన్నీ ఒక శాతం లేదా అంతకన్నా తక్కువగా లాభపడ్డ షేర్లే. ఇక నష్టాల్లో ముగిసిన టాప్‌ 5 నిఫ్టి షేర్లలో టాటా స్టీల్‌ టాప్‌లో ఉంది. ఈ షేర్‌ 8 శాతంపైగా నష్టపోయింది. హిందాల్కో కూడా నష్టాలు కూడా ఇదే స్థాయిలో ఉన్నాయి. 7 శాతం నష్టపోయిన ఓఎన్‌జీసీ మూడో స్థానంలో నిలిచింది. టాటా మోటార్స్‌ నష్టం కూడా అంతే. ఇక నాలుగో స్థానంలో ఉన్న సిప్లా షేర్‌ 6 శాతంపైగా నష్టపోయింది. ఫార్మా రంగంపై కూడా సుంకాలు ఉంటాయని సంకేతాలు రావడంతో ఇవాళ ఈ కౌంటర్లలో భారీ అమ్మకాల ఒత్తిడి కన్పించింది.