వెంటనే అమ్మకాల ఒత్తిడి
సంవత్ 2080 రోజున ఆర్జించిన దాదాపు మొత్తం లాభాలు ఇవాళ కరిగి పోయాయి. అమెరికాను మూడీస్ రేటింగ్ డౌన్ గ్రేడ్ చేయడంతో అమెరికా ఐటీ షేర్లలో అమ్మకాల ఒత్తిడి వస్తుందని ఇన్వెస్టర్లు భయపడుతున్నారు. దీంతో మన దేశంలో ఐటీ కౌంటర్లో భారీ అమ్మకాల ఒత్తిడి వచ్చింది. బ్యాంక్ నిఫ్టి పటిష్ఠంగా ఉన్నట్లు కన్పించినా.. చివర్లో నష్టాల్లో ముగిసింది. వెరశి క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి ఇవాళ 86 పాయింట్ల నష్టంతో 19439 పాయింట్ల వద్ద ముగిసింది. నిన్న నిఫ్టి వంద పాయింట్లు పెరిగిన విషయం తెలిసింది. ఉదయం ఆరంభంలోనే నిఫ్టి ఇవాళ కనిష్ట స్థాయి 19414 పాయింట్లని తాకింది. ఆ తరవాత కోలుకున్నా… అధిక స్థాయిలో నిలబడలేకపోయింది. ఐటీ షేర్లలో అమ్మకాలతో పాటు బ్యాంకు షేర్లు నెమ్మదించడంతో మార్కెట్ నిస్తేజంగా మారింది. క్రమంగా అసెంబ్లీ ఎన్నికల ప్రభావం స్టాక్ మార్కెట్లపై కన్పించే అవకాశముంది.