రోజంతా పతనమే….
పశ్చిమాసియా యుద్ధాన్ని ప్రపంచ మార్కెట్లు పెద్దగా ఖాతరు చేయకున్నా…మన మార్కెట్ తీవ్రంగా స్పందించింది. దీనికి తోడు ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ విభాగంలో సెబీ తెచ్చిన ఆంక్షలకు కూడా మార్కెట్ నెగిటివ్‌గా స్పందించింది. ఆరంభంలో ఓపెనింగ్ స్థాయి నుంచి ఏకంగా 200 పాయింట్లు పెరిగి 25,639 పాయింట్లను తాకిన నిఫ్టి… అక్కడి నుంచి రోజంతా క్రమంగా క్షీణిస్తూ వచ్చింది. ఏ దశలోనూ నిఫ్టికి మద్దతు లభించలేదు. యూరోపియన్ మార్కెట్లు స్వల్ప నష్టాలతో ప్రారంభమైనా.. మన మార్కెట్లలో పతనం ఆగలేదు. 2 గంటల వరకు భారీగా క్షీణించిన నిఫ్టి… ఆ తరవాత స్వల్ప హెచ్చుతగ్గులతో చివరిదాకా కొనసాగింది. చివరల్లో గరిష్ఠస్థాయి నుంచి ఏకంగా 400 పాయింట్లు క్షీణించి 25250 వద్ద ముగిసింది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 547 పాయింట్లు క్షీణించింది. సెన్సెక్స్ కూడా 1769 పాయింట్లు క్షీణించింది. దిగువన 50 రోజుల చలన సగటుకు దగ్గరగా.. ఎగువ నుంచి 30 రోజుల చలన సగటుకు పైన నిఫ్టి ఉండటంతో.,.. పెద్ద ఇన్వెస్టర్లు తాజా పొజిషన్లకు జంకారు. అమెరికా ఫ్యూచర్స్ ఇవాళ కూడా స్వల్ప నష్టాల్లో ఉన్నా…. మన సూచీలు రెండు శాతంపైగా నష్టపోయాయి. నిఫ్టినే గాక.. ఇతర ప్రధాన రంగాల సూచీల నష్టాలన్నీ 2 శాతంపైనే ఉన్నాయి. నిఫ్టిలో కేవలం 2 షేర్లు తప్ప మిగిలిన 48 షేర్లు నష్టాల్లో ముగిశాయి. మిడ్ క్యాప్, నిఫ్టి బ్యాంక్, నిఫ్టి ఫైనాన్షియల్ సూచీలు రెండున్నర శాతం నష్టపోయాయి. జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఓఎన్‌జీసీ మినహా మిగిలిన షేర్లన్నీ నష్టాల్లో ముగిశాయి. చమురు ధరలు బాగా పెరిగినందున ఇవాళ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల షేర్లు భారీగా నష్టపోయాయి. అయిదు శాతం నష్టంతో బీపీసీఎల్ నిఫ్టి లూజర్స్ జాబితాలో టాప్‌లో ఉంది. శ్రీరామ్ ఫైనాన్స్, ఎల్ అండ్ టీ షేర్లు నాలుగు శాతం పైగా, యాక్సిస్ బ్యాంక్, రిలయన్స్ షేర్లు నాలుగు శాతం వరకు నష్టపోయాయి.