For Money

Business News

7 నెలల కనిష్ఠానికి…

మార్కెట్ తీవ్ర హెచ్చుతగ్గులకు లోనైంది. మార్కెట్‌ కదలికలు ఇన్వెస్టర్లను ఆశ్చర్య పర్చింది. కేవలం కొన్ని నిమిషాల్లో సూచీలు భిన్నంగా కదలాడటం నిజంగా విచిత్రం. కార్పొరేట్‌ ఫలితాలు ఈసారి అంతంత మాత్రంగానే ఉంటాయని మార్కెట్‌ తెలుసు. మరోవైపు పదవీ బాధ్యతలు తీసుకున్న తరవాత ట్రంప్‌ కూడా పెద్ద కఠిన చర్యలు తీసుకోలేదు. అయినా గిఫ్ట్‌ నిఫ్టి నిన్న రాత్రి 170 పాయింట్ల లాభంతో ఉంది. ఇవాళ ఉదయం ఆ లాభాలు 50 పాయింట్లకు తగ్గాయి. నిఫ్టి కూడా ఓపెనింగ్‌లో 23400పైకి చేరినా… ఆ వెంటనే నష్టాల్లోకి జారుకుంది. మిడ్ సెషన్‌లోపే 23141 పాయింట్ల స్థాయిన తాకింది. కాని కేవలం కొన్ని నిమిషాల్లోనే మొత్తం నష్టాలను పూడ్చుకుని గ్రీన్‌లోకి వచ్చింది. ఈ అకస్మాత్‌ పరిణామానికి మార్కెట్‌ ఆశ్చర్యపోయింది. అయితే ఈ షాక్‌ నుంచి తీరుకునేలోగా మళ్ళీ నష్టాల్లోకి జారుకుంది. రెండు గంటల తరవాత నష్టాలు మరీ తీవ్రమై… నిఫ్టి 23000 దిగువకు జారి… 22976ని తాకింది. ఆ తరవాత స్వల్పంగా కోలుకుని 320 పాయింట్ల నష్టంతో 23024 వద్ద ముగిసింది. నిఫ్టిలో 41 షేర్లు నష్టాల్లో ముగిశాయి. ఇవాళ రియల్‌ ఎస్టేట్‌ రంగ సూచీ రికార్డు స్థాయిలో నాలుగు శాతం నష్టపోయింది. దాదాపు అన్ని సూచీలు ఇవాళ రెడ్‌లో ముగిశాయి. కొన్ని నిఫ్టి షేర్లు స్వల్ప లాభాల్లో ముగిశాయి. ట్రెంట్‌ ఇవాళ కూడా ఆరు శాతం క్షీణించడం విశేషం. నిన్న ఈ షేర్‌ అయిదు శాతం నష్టపోయింది. నిఫ్టి షేర్లలో ఇదే టాప్‌ లూజర్‌. తరవాతి స్థానంలో ఎన్‌టీపీసీ, అదానీ పోర్ట్స్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, అదానీ ఎంటర్‌ప్రైజస్‌ ఉన్నాయి.