ఇవాళ్టి నిఫ్టి ర్యాలీ వెనుక?

మార్కెట్ ఉదయం కాస్త తటపటాయించినా… క్రమంగా బలపడింది. చాలా రోజుల నుంచి 25000 ప్రాంతంలో నిఫ్టి బాగా తడబడింది. ఆ తరవాత 25500 స్థాయి వద్ద గట్టిగా నిలబడలేకపోయింది. పలు మార్లు ఈ స్థాయికి వచ్చి… దిగువకు పడిపోయింది. అమెరికా, చైనా మధ్య వాణిజ్య ఒప్పందం కుదరడంతో పాటు భారత్‌తో భారీ డీల్‌కు అమెరికా రెడీ అవుతున్నట్లు ట్రంప్ చేసిన ప్రకటన ఇన్వెస్టర్లకు గట్టి నమ్మకం కల్గించింది. ముఖ్యంగా విదేశీ ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను పెంచుతున్నారు. పైగా ఫెడ్ జులైలో వడ్డీ రేట్లను తగ్గిస్తున్న వార్తలు ఇపుడు బాగా పెరిగాయి. ఈ నేపథ్యంలో నిఫ్టి ఇవాళ ఉదయం నష్టాల్లోకి జారుకుని 25523 స్థాయిని తాకినా… వెంటనే కోలుకుని 25654 పాయింట్ల గరిష్ఠ స్థాయిని తాకింది. దాదాపు అదే స్థాయిలో అంటే 25637 వద్ద 89 పాయింట్ల లాభంలో ముగిసింది. నిఫ్టితో పాటు మిడ్, స్మాల్ క్యాప్ షేర్లకు కూడా మంచి మద్దతు రావడం విశేషం. ఇవాళ నిఫ్టి మెటల్స్, మీడియా సూచీలు కూడా 4 శాతం లాభపడ్డాయి. మరోవైపు ఫారెక్స్ మార్కెట్‌లో డాలర్‌తో రూపాయి కాస్త బలపడి 85.49 వద్ద ముగిసింది.