18 వేలు పైన ముగిసిన నిఫ్టీ

అంతర్జాతీయ మార్కెట్లు స్తబ్దుగా ఉన్నా మన మార్కెట్లు ఆకర్షణీయ లాభాలతో ముగిశాయి. ఉదయం దిగువ స్థాయి నుంచి ఒక మోస్తరు లాభాలు ఆర్జించిన మార్కెట్ మిడ్ సెషన్ కల్లా చాలా వరకు లాభాలను కోల్పోయింది. అయితే మిడ్ సెషన్ నుంచి క్రమంగా కోలుకుంటూ 18072 పాయింట్ల గరిష్ఠ స్థాయిని తాకింది. చివరికి 158 పాయింట్ల లాభంతో 18053 పాయింట్ల వద్ద ముగిసింది. బ్యాంకు షేర్లు స్తబ్దుగా ఉన్నా… మిడ్ క్యాప్ సూచీ క్షీణించినా… నిఫ్టి మాత్రం 0.9 శాతం లాభంతో క్లోజైంది. ముఖ్యంగా నిఫ్టికి ఎల్ అండ్ టీ, హెచ్‌యూఎల్ షేర్ల నుంచి గట్టి మద్దతు లభించింది. చాలా రోజుల తరవాత ఐటీ షేర్లు కూడా మద్దతు అందింది. డిసెంబర్ హోల్‌సేల్ ద్రవ్యోల్బణం రెండేళ్ళ కనిష్ట స్థాయికి క్షీణించడంతో పాటు క్రూడ్ ఆయిల్ కూడా మార్కెట్ సెంటిమెంట్‌ను పెంచాయి. సెన్సెక్స్‌లో కూడా ఎల్ అండ్ టీ, హిందూస్థాన్ యూనీలివర్, హెచ్‌యూఎల్ టెక్నాలజీస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ తో పాటు రిలయన్స్ ఇండస్ట్రీస్ రాణించాయి. ఇవాళ ఎస్‌బీఐ షేర్‌లో గట్టి ఒత్తిడి వచ్చింది. ఈ షేర్ దాదాపు 1.6 శాతం క్షీణించింది.