జస్ట్ మిస్…అన్నంత పనీ చేసిన నిఫ్టి
స్టాక్ మార్కెట్ అనలిస్టుల అంచనాలను నిజం చేస్తూ నిఫ్టి దాదాపు 16000 స్థాయిని తాకింది. కొద్దిసేపటి క్రితం నిఫ్టి 16011 పాయింట్లను తాకింది. ప్రస్తుతం 228 పాయింట్ల 16040 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. పలు ప్రధాన కౌంటర్లలో భారీ అమ్మకాల ఒత్తిడి వస్తోంది. కొత్త తరం ఇన్వెస్టర్ల డార్లింగ్ షేర్లయిన కేపీఐటీ సిస్టమ్స్, డిక్సన్ టెక్నాలజీస్, టాటా మోటార్స్‌తో పాటు సిమెంట్ కంపెనీల్లో భారీ ఒత్తిడి వస్తోంది. ఇక న్యూఏజ్ షేర్లలో అమ్మకాలు సరేసరి. రోజూ కొత్త కనిష్ఠ స్థాయిని తాకుతున్నాయి. నిఫ్టి నెక్ట్స్ 1.5 శాతం నష్టపోగా, నిఫ్టి మిడ్‌క్యాప్ షేర్లు ఏకంగా రెండు శాతంపైగా నష్టపోయాయి. బ్యాంక్, నిఫ్టిలోని ఫార్మా షేర్లు కాస్త బలంగా ఉండటంతో నిఫ్టి ఇంకా 16000పైన ట్రేడ్ అవుతోందని చెప్పొచ్చు. యూరో మార్కెట్లు లాభాల్లో ప్రారంభమయ్యాయి.యూరోస్టాక్స్ 50 సూచీ 0.6 శాతంపైన ఉంది. జర్మనీ డాక్స్ 0.23 శాతం లాభంతో ఉంది. ఇవన్నీ ఒక మోస్తరు లాభాలు కాబట్టి… చివరి వరకు ఉంటాయా అన్న అనుమానముంది. అమెరికా ఫ్యూచర్స్ కూడా గ్రీన్‌లో ఉంది. అయితే రాత్రికి వచ్చే అమెరికా CPI డేటా కోసం మార్కెట్ ఎదురు చూస్తోంది. ఆ ఆశతో నిఫ్టి కోలుకుంటుందా లేదా 16000 దిగువకు వెళుతుందా అనేది చూడాలి.