For Money

Business News

లాభాల్లో నిఫ్టి కాని…

సింగపూర్ నిఫ్టి లాభాల స్థాయిలోనే నిఫ్టి ప్రారంభమైంది. ఓపెనింగ్‌లోనే 18664ని తాకింది. వెంటనే లాభాల స్వీకరణతో 18635ని తాకినా.. ఇపుడు 18655 వద్ద ట్రేడవుతోంది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 46 పాయింట్లు పెరిగింది. నిఫ్టిలో ఏకంగా 46 షేర్లు లాభాల్లో ఉన్నా… అన్నీ నామమాత్రమే కావడంతో నిఫ్టిలో ఆ జోరు కన్పించడం లేదు. అన్ని సూచీలు గ్రీన్‌లో ఉన్నా… నిఫ్టి బ్యాంక్‌లో లాభాల స్వీకరణ కన్పిస్తోంది. ఇవాళ మార్కెట్‌ ఫలానా రంగానికి మద్దతు వచ్చిందని చెప్పడానికి లేదు. అయితే ఐటీ షేర్లలో ఒత్తిడి కన్పిస్తోంది. వృద్ధి అంచనాలను హెచ్‌సీఎల్‌ టెక్‌ సవరించడంతో ఆ షేర్‌ 5 శాతం దాకా క్షీణించింది. నిఫ్టి టాప్‌ లూజర్స్‌లో నాలుగు షేర్లు ఐటీ షేర్లు ఉండటానికి ఇదే కారణం. ఈనెల 13న బైబ్యాక్‌పై నిర్ణయం తీసుకునేందుకు పేటీఎం బోర్డు సమావేశం కానుంది. దీంతో షేర్‌ అయిదు శాతం పెరిగింది. బ్యాంకు షేర్లలో ముఖ్యంగా మిడ్‌క్యాప్‌ బ్యాంకు షేర్లలో మద్దతు కొనసాగుతూనే ఉంది. పీఎన్‌బీ, ఫెడరల్‌ బ్యాంక్‌ లాభాల్లో ఉన్నాయి. ముఖ్యంగా ఫెడరల్‌ బ్యాంక్‌ క్రమంగా పెరుగతూ వస్తోంది. అక్టోబర్‌ నెల ఆరంభంలో రూ. 109 ఉన్న ఈ షేర్‌ ఇపుడు రూ.138ని తాకింది.