For Money

Business News

నికెల్‌ ట్రేడింగ్‌: అడ్డంగా బుక్కయిన చైనా బ్యాంక్‌

లండన్‌ మెటల్‌ ఎక్స్ఛేంజీ (ఎల్‌ఎంఈ) ఏర్పడి 145 ఏళ్ళయింది. ఆ ఎక్స్ఛేంజీ చరిత్రలో ఎన్నడూ చూడని ఘటనను ఇన్వెస్టర్లు ఇవాళ చూశారు. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రకటించడంతో గత కొన్ని రోజులుగా మెటల్స్‌ ధరలు పెరుగుతున్న మాట నిజమే. ఈ రెండు దేశాల నుంచి ప్రపంచ మార్కెట్‌కు కీలక మెటల్స్‌ సరఫరా అవుతాయి. ప్రపంచ నికెల్‌ ఉత్పత్తిలో 17 శాతం రష్యా నుంచి వస్తుంది. దీన్ని స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ తయారీకి, ఎలక్ట్రిక్‌ కార్లకు వాడే బ్యాటరీలలో వాడుతారు. రష్యా యుద్ధం ప్రకటించిన వెంటనే ఇతర మెంటల్స్‌తోపాటు నికెల్‌ రేట్లు కూడా పెరిగాయి. ఈ ఏడాది ఆరంభంలో ఎల్‌ఎంఈలో టన్ను నికెల్ రేటు 20,900 డాలర్లు. సెంటిమెంట్‌ బాగుండటంతో క్రమంగా పెరుగుతూ వచ్చింది. మొన్నటి వరకు 25000 డాలర్ల లోపే ఉండేది. అయితే చైనా కన్‌స్ట్రక్షన్‌ బ్యాంక్‌ కార్పొరేషన్‌కు చెందిన సంస్థ ఒకటి నికెల్‌ను ఫ్యూచర్‌ మార్కెట్‌ భారీ ఎత్తున షార్ట్‌ చేసింది. నిన్న సెటిల్‌మెంట్‌ చివరి రోజు. దీంతో షార్ట్‌ చేసిన కంపెనీ సదరు కాంట్రాక్ట్‌ను కొనాలి. కాని మార్కెట్‌లో అమ్మేవారు లేరు. దీంతో ట్రేడింగ్‌ ముగిసే సమయానికల్లా నికెల్‌ రేటు క్రితం ముగింపు కంటే 90 శాతం పెరిగింది. దీంతో వేల కోట్లలో చైనా బ్యాంక్‌ నష్టపోయింది. అంత సొమ్ము వెంటనే కట్టే పరిస్థితి లేకపోవడం, 145 ఏక్స్ఛేంజీ నిబంధనలు మార్చి వెసులుబాటు కల్గించింది. సెటిల్‌మెంట్‌ను ఒక రోజు పెంచింది. అంటే ఇవాళ చైనా బ్యాంక్‌ తన పొజిషన్స్‌ను క్లోజ్‌ చేయాలి. అంటే నికెల్‌ను కొనాలి. విషయం బయటకు పొక్కడంతో ఇవాళ కూడా ఎవరూ నికెల్‌ అమ్మేందుకు ముందుకు రాలేదు. దీంతో నిన్నటి ధరకు రెట్టింపు అంటే 111 శాతం పెరిగి టన్ను నికెల్‌ రేటు 1,00,000 డాలర్లకు చేరింది. దీంతో చైనా కంపెనీ నష్టాలు ఇవాళ రెట్టింపు అయ్యాయి. లండన్‌లోని ఎల్‌ఎంఈలోనే కాదు షాంఘై ఎక్స్ఛేంజీలో కూడా నికెల్‌ 106 శాతం పెరిగి 99,000 డాలర్లకు చేరింది. యుద్ధం కారణంగా మార్కెట్‌లో పరిస్థితి కేవలం గంటల్లో ఎలా తలకిందులౌతాయో ఇదొక ఉదాహరణ.