2022లో స్థిరాస్తి, బ్యాంకులు రాణిస్తాయ్!
వచ్చే ఏడాదిలో రియల్ ఎస్టేట్, బ్యాంకింగ్, ఫైనాన్స్, భారీ యంత్ర పరికరాల షేర్లు పెరిగే అవకాశం ఉందని కోటక్ మహీంద్రా ఏఎంసీ పోర్ట్‌ఫోలియో మేనేజర్, హెడ్ ఆఫ్ పోర్ట్‌ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్ అన్షుల్ సైగల్ అభిప్రాయపడ్డారు. కొవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఆందోళనలు మార్కెట్‌పై ఎంత ప్రభావం చూపుతాయో వేచి చూడాల్సి ఉందని ఆయన ఈనాడుకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారను. ఇటీవల వచ్చిన ర్యాలీ నేపథ్యంలో ప్రస్తుతం దిద్దుబాటు వస్తోందని పేర్కొన్నారు. వచ్చే ఏడాదిలో ప్రస్తుత స్థాయి నుంచి మార్కెట్ 10 శాతం అటు ఇటుగా కదలాడొచ్చని వెల్లడించారు. ఇటీవల కొత్త తరం కంపెనీలు అధిక ధరల వద్ద ఐపీఓలకు వస్తున్న నేపథ్యంలో, మదుపర్లు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అమెరికాలో వడ్డీ రేట్ల పెంపునకు, భారత్ స్టాక్ మార్కెట్లకు పెద్ద లింక్ లేదని ఆయన అభిప్రాయపడ్డారు. 2003లో అమెరికా కేంద్ర బ్యాంకు వడ్డీ రేట్లను పెంచిందని.. దీంతో 1 శాతం నుంచి వడ్డీ రేట్లు 2007 చివరకు 5 శాతానికి చేరిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. అయితే సెన్సెక్స్ మాత్రం 3,000 పాయింట్ల నుంచి 21,000 పాయింట్లకు చేరిందన్నారు. వచ్చే ఏడాది
స్థిరాస్తి రంగం బాగుంటుందని ఆయన చెప్పారు. బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్లను కూడా గమనించొచ్చని అన్నారు. మూలధన వ్యయాలు పెరిగే అవకాశం ఉండటంతో భారీ యంత్ర పరికరాల షేర్లకు కూడా కలిసిరావొచ్చని చెప్పారు. ఫార్మా కంపెనీలలో ఇటీవల కరెక్షన్ వచ్చింది. వీటిపై కూడా ఇన్వెస్టర్లు దృష్టి సారించొచ్చని అన్నారు.