రూ. 300 కోట్లతో ఎన్సీఎల్ విస్తరణ
ఎన్సీఎల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ రూ.300 కోట్లతో విస్తరణ చేపట్టినట్లు కంపెనీ ఎండీ కె.రవి తెలిపారు. కొత్తగా విశాఖపట్టణం వద్ద గ్రైండింగ్ యూనిట్ ఏర్పాటు చేయాలని, మట్టంపల్లి యూనిట్లో రోలర్ మిల్లుల ఆధునికీకరణ చేపట్టాలని నిర్ణయించినట్లు ఆయన ఈనాడు పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. విస్తరణ కోసం రుణం తీసుకోవటంతో పాటు అంతర్గత వనరులను వెచ్చిస్తామని చెప్పారు. విశాఖలో నెలకొల్పే గ్రైండింగ్ మిల్లు కోసం రూ.150 కోట్లు పెట్టుబడి పెడతామన్నారు. ఇక మట్టంపల్లిలోని తమ సిమెంటు యూనిట్లో పాత యంత్రాల స్థానంలో అత్యాధునిక వర్టికల్ రోలర్మిల్లులు, ప్యాకింగ్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. వచ్చే రెండేళ్ల వ్యవధిలో ఈ విస్తరణను పూర్తి చేయాలని కంపెనీ భావిస్తోంది. సౌర విద్యుత్తు ప్యానెళ్ల తయారీ యూనిట్‌ను 8 మెగావాట్ల సామర్థ్యంతో ఏర్పాటు చేస్తున్నట్లు రవి తెలిపారు.