నజారా చేతికి డేటావర్క్స్
బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న డేటా వర్క్స్‌లో మెజారిటీ వాటాను నజారా టెక్నాలజీస్ చేజక్కించుకుంది. డేటావర్క్స్ కంపెనీ విలువ రూ. 225 కోట్లుగా లెక్కగట్టి.. అందులో 55 శాతం వాటాకు రూ. 124 కోట్లు చెల్లించేందుకు నజారా అంగీకరించించింది. పబ్లిషర్స్‌కు పోగ్రామాటిక్ అడ్వర్టయిజింగ్, మానిటైజేషన్ సేవలను డేటావర్క్స్ అందిస్తోంది. సంస్థలో మొదటి దశలో 33శాతం వాటాను రూ. 60 కోట్లకు నజారా టెక్నాలజీస్ కొనుగోలు చేయనుంది. రూ. 35 కోట్లను క్యాష్ రూపంలో, రూ. 25 కోట్లు నగదు లేదా షేర్ స్వాప్ కింద చెల్లిస్తారు. రెండో దశలో కంపెనీ మరో 22 శాతంవాటా కొనుగోలు చేస్తుంది. ఈ లావాదేవీ వచ్చే ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో పూర్తయ్యే అవకాశముందని కంపెనీ అంచనా వేస్తోంది. టేకోవర్ వార్తలతో ఇవాళ నజారా టెక్నాలజీస్ అమ్మకాల ఒత్తిడికి లోనవుతోంది. ఒకదశలో షేర్ ధర దాదాపు 4శాతం నష్టపోయి రూ.2360కి పడిపోయింది. ప్రస్తుతం ఒకశాతం పైగా నష్టంతో రూ.2425 వద్ద షేర్ ట్రేడవుతోంది. ఇవాళ ఇప్పటివరకు ఎన్ఎస్ఈలో దాదాపు 38 వేల షేర్లు ట్రేడయ్యాయి. ఇక కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ విషయానికి వస్తే రూ.7910 కోట్లకు పడిపోయింది.