డాలర్ ఢమాల్… నాస్‌డాక్ జూమ్
అనేక కంపెనీలు అంచనాలకు మించి లాభాలు గడించడంతో పాటు అమెజాన్, యాపిల్ ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో వాల్‌స్ట్రీట్ ఆకర్షణీయ లాభాలతో ట్రేడవుతోంది. నాస్‌డాక్ ఒక శావతంపైగా లాభంతో ట్రేడవుతోంది. అమెజాన్, టెస్తా, యాపిల్, క్యాటర్‌పిల్లర్, ఫోర్డ్, మెర్క్ వంటి కంపెనీల షేర్లు మంచి దూకుడు మీద ఉన్నాయి. ఎస్ అండ్ పీ 500 సూచీ కూడా 0.8 శాతం లాభంతో ట్రేడవుతుండగా, డౌజౌన్స్ అర శాతం దాకా లాభపడింది. కరెన్సీ మార్కెట్‌లో డాలర్ ఇవాళ చతికిల పడింది. అమెరికా ప్రభుత్వం ఇక డాలర్‌ను పెరగనివ్వదని తెలుస్తోంది. డాలర్ ఇండెక్స్ ఇవాళ 0.5 శాతం క్షీణించింది. నిజానికి ఈ దెబ్బకు భారీగా పెరగాల్సిన క్రూడ్ ధరలు ఒక శాతంపైగా నష్టంతో ట్రేడవుతున్నాయి. దీనికి ప్రధాన కారణంగా అమెరికా వారాంతపు చమురు నిల్వలు అధికంగా ఉండటం, కరోనా కేసులు పెరుగుతుండటమని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. డాలర్ ఆ స్థాయిలో క్షీణించినా బులియన్ స్థిరంగా ఉంది. వెండి నష్టాల్లో ఉండటం విశేషం.