ఒకే రోజు రూ.18,82,500 కోట్లు ఔట్
ప్రపంచ స్టాక్ మార్కెట్ చరిత్రలో మొదటిసారి ఒక కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఒకే రోజులో రూ.18,82,500 కోట్లు (25100 కోట్ల డాలర్లు) తగ్గింది. ఫేస్‌బుక్ ఆ చరిత్ర సృష్టించింది. డిసెంబర్‌తో ముగిసిన ఏడాదికి ఫలితాలు ప్రకటించిన కంపెనీ చేసిన ఒకే ఒక్క ప్రకటన కంపెనీని ముంచేసింది. ఫేస్‌బుక్ పేరును మెటా ప్లాట్‌ఫామ్స్‌గా మార్చిన విషయం తెలిసిందే. జనవరి-మార్చి త్రైమాసికంలో కంపెనీ ఆదాయ వృద్ధి రేటు తగ్గుతుందంటూ కంపెనీ వార్నింగ్ ఇవ్వడంతో ఇన్వెస్టర్లు ఆ కంపెనీ షేర్లను భారీగా అమ్మారు. ఒకదశలో ఈ షేర్ 26 శాతం క్షీణించింది. ఫేస్‌బుక్ రోజువారీ గ్లోబల్ యాక్టివ్ యూజర్లు డిసెంబర్ త్రైమాసికంలోనూ 192.9 కోట్లకు తగ్గారు. ఫేస్‌బుక్ ప్రారంభించిన తర్వాత యూజర్లను కోల్పోవడం ఇదే మొదటిసారి. యాపిల్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో ప్రైవసీకి సంబంధించి చేసిన మార్పులు, టిక్‌టాక్ వంటి సోషల్ మీడియా ప్రత్యర్థి సంస్థల నుంచి పోటీ పెరగడంతో పనితీరు మెరుగవలేదని ఫేస్‌బుక్ వెల్లడించింది.