For Money

Business News

మంత్రి మేకపాటి హఠాన్మరణం

ఏపీ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి (50) కన్నుమూశారు. ఇవాళ ఉదయం గుండెపోటు వచ్చింది. వెంటనే ఆయనను హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. ఆయన హఠాన్మరణంతో అభిమానులు, వైసీపీ కార్యకర్తలు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. వారం రోజుల పాటు దుబాయ్ పర్యటన ముగించుకొని నిన్న గౌతమ్‌ హైదరాబాద్‌కు వచ్చారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు నుంచి ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఆయన తండ్రి మేకపాటి రాజమోహన్‌ రెడ్డి ప్రముఖ పారిశ్రామికవేత్త, మాజీ ఎంపీ కూడా. మేకపాటి రాజమోహన్‌రెడ్డి ఉదయగిరి, ఒంగోలు, నరసరావుపేట, నెల్లూరు పార్లమెంట్‌ సభ్యుడిగా పనిచేశారు. మేకపాటి గౌతమ్‌ రెడ్డి 1976
నవంబర్‌ 2వ తేదీన నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం బ్రాహ్మణపల్లిలో జన్మించారు. బ్రిటన్‌లోని మాంచెస్టర్‌ యూనివర్సిటీ నుంచి టెక్స్‌టైల్స్‌లో ఎమ్మెస్సీ చేశారు. ఆయనకు భార్య శ్రీకీర్తి, కుమార్తె అనన్య రెడ్డి, కుమారుడు అర్జున్‌ రెడ్డి ఉన్నారు. తండ్రి రాజమోహన్‌ రెడ్డి నెలకొల్పిన కేఎంసీ కంపెనీకి ఇతను మేనేజింగ్‌ డైరెక్టర్‌గా పనిచేశారు. తరవాత ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. ఆత్మకూరు నుంచి 2014, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన గెలిచారు. జగన్మోహర్‌ రెడ్డి కేబినెట్‌ కీలక పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు.