రూ.77 లక్షల కోట్లు పెరిగింది

ఏడాది చివర్లో అమ్మకాల ఒత్తిడి కారణంగా మార్కెట్‌లో ఒత్తిడి కన్పించినా… ఏడాదిలో భారీ లాభాలను ఇన్వెస్టర్లకు మార్కెట్ ఇచ్చింది. అక్టోబర్ నుంచి విదేశీ ఇన్వెస్టర్లు భారీగా అమ్మకాలు జరపడంతో నిఫ్టి తీవ్ర ఒడుదుడుకులకు లోనైంది. 2023తో పోలిస్తే 2024లో నిఫ్టీ 1913.40 పాయింట్లు (8.80శాతం), సెన్సెక్స్ 5898.75 పాయింట్లు (8.16 శాతం) లాభపడ్డాయి.ఇదే ఏడాది సూచీలు తమ జీవితకాల గరిష్ఠ స్థాయిలను కూడా తాకాయి. అయితే రికార్డు లాభాలు గడించిన రంగం స్మాల్ క్యాప్స్. బీఎస్‌ఈ స్మాల్‌క్యాప్ సూచీ గత ఏడాది 29 శాతంపైగా అంటే 12,506.84 పాయింట్లకు పైగా లాభపడింది. ఇక మిడ్‌క్యాప్ సూచీ కూడా 26 శాతం పైగా లాభంతో 9,605 పాయిం ట్లు లాభపడింది. ఇక ఏడాదిలో బీఎస్‌ఈలో లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ రూ.77,66,260.19 కోట్లు పెరిగింది. నిన్నటి బీఎస్‌ఈ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.4,41,95,106.44 కోట్లు. కరోనా తరవాత మార్కెట్ ఏకపక్షంగా సాగింది. వరుసగా కొన్ని నెలల పాటు బుల్‌రన్ జోరు కొనసాగింది. అయితే 2021 నుంచి నిఫ్టిలో కాస్త మందగమనం కన్పించింది.అయితే ఏటా లాభాల్లోనే ముగిసింది. 2024లో మాత్రం మెజారిటీ రోజులు మార్కెట్‌లో నువ్వా నేనా అన్నట్లు బుల్, బేర్ ఆపరేటర్ల మధ్య గట్టి పోరు సాగింది.