For Money

Business News

24% డౌన్‌.. ఇంకా తగ్గుతుందా?

మణప్పురం ఫైనాన్స్‌ షేర్‌ గత 8 సెషన్స్‌లో ఏకంగా 24 శాతం క్షీణించింది. అంతా బాగుందని.. షేర్‌ ధర భారీ పెరిగి.. అనుబంధ సంస్థ పబ్లిక్‌ ఆఫర్‌ రెడీ అవుతున్న సమయంలో భారత రిజర్వు బ్యాంక్‌ (ఆర్బీఐ) ఆదేశాలు ఈ కంపెనీకి శరాఘాతంలా తగిలాయి. గత జులైలో రూ. 230ని తాకిన ఈ షేర్‌ .. దాదాపు అదే స్థాయిలో కొనసాగుతున్న సమయంలో ఆర్బీఐ ఆదేశాలు కంపెనీ షేర్‌ను దారుణంగా దెబ్బతీశాయి. ఈ కంపెనీ అనుబంధ సంస్థ అయిన ఆశీర్వాద్‌ మైక్రో ఫైనాన్స్‌ పబ్లిక్‌ ఆఫర్‌కు సిద్ధమౌతోంది. దీంతో మణప్పురం ఫైనాన్స్‌ షేర్‌ మార్కెట్‌లో బలపడింది. అయితే కొత్త రుణాలను మంజూరు చేయడం గాని లేదా పంపిణీ చేయడం గాని చేయొద్దని ఆశీర్వాద్‌ మైక్రోకు ఆర్బీఐ ఆదేశాలు జారీ చేసింది. దీని ప్రభావం డైరెక్ట్‌గా మణప్పురం ఫైనాన్స్‌పై పడింది. ఎందుకంటే కంపెనీ కన్సాలిడేటెడ్‌ టర్నోవర్‌లో 27 శాతం ఈ కంపెనీ నుంచే వస్తోంది. మైక్రోఫైనాన్స్‌తో పాటు గోల్డ్‌ లోన్‌ కూడా ఇచ్చే ఆశీర్వాద్‌ మొత్తంగా రూ. 12,300 కోట్ల విలువైన లావాదేవీలను నిర్వహిస్తోంది. గవర్నన్స్‌తో పాటు నిబంధనల ఉల్లంఘన జరిగి ఉంటే తాము సరిదిద్దుతామని మణప్పురం అంటోంది. ఆర్బీఐ ఆంక్షలు ఇవాళ్టి నుంచి అమల్లోకి వస్తాయి. ఈ లోగానే షేర్‌ 24 శాతం వరకు క్షీణించింది. ఇవాళ కూడా ఈషేర్‌ 5 శాతం దాకా క్షీణించి రూ. 146ని తాకింది. ఈ షేర్‌ 52 వారాల కనిష్ఠ స్థాయి రూ. 125. మళ్ళీ ఈ స్థాయికి కంపెనీ షేర్‌ చేరుతుందా లేదా ఇక్కడి నుంచి కోలుకుంటుందా అన్నది చూడాలి. ఎందుకంటే ఆర్బీఐ విధించిన ఆంక్షలు ఆరు నుంచి తొమ్మిది నెలలు ఉంటాయి. ఈలోగా పెట్టుబడికి ఈ షేర్‌ ఛాన్స్‌ ఇచ్చే అవకాశముంది.

Leave a Reply