బార్క్ రేటింగ్‌పై కేంద్రం బ్యాన్ ఎన్నాళ్ళు?
దేశంలోని కీలక వ్యవస్థలన్నీ తమ చెప్పు చేతుల్లోకి తెచ్చుకుందని బీజేపీపై కాంగ్రెస్ పొద్దస్తమానం ఆరోపణలు చేస్తూ ఉంటుంది. దీన్ని జనం చాలా రొటీన్ తీసుకున్నారు. ఇపుడు మీడియా కూడా మోడీ గుప్పెట్లో ఉందని రాహుల్ ఆరోపిస్తున్నారు. మీకు ధైర్యం లేదా? మీరు అధికార పార్టీని ప్రశ్నించరెందుకు అని నేరుగా జర్నలిస్టులనే ఆయన ప్రశ్నిస్తున్నారు. నిజంగానే మీడియా మోడీకి మోకరిల్లిందా? పూర్తిగా ప్రైవేట్ కంపెనీల చేతిలో ఉన్న మీడియా ఢిల్లీకి బానిస ఎలా అవుతుంది? ఈడీ, సీబీఐలతో ఈ వ్యవస్థను కూడా నిర్వీర్వం చేస్తారనే భయమా? ఇలాంటి ప్రశ్నలు గత కొంతకాలంగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా మీడియాలోనే. మొత్తం మీడియా మోడీ చెప్పు చేతుల్లో ఉందని అంటోంది విదేశీ మీడియా. అందుకే ఇతర వ్యవస్థలకు భిన్నంగా మీడియా విషయంలో మోడీ ప్రభుత్వం చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. మీడియా సంస్థలను మేనేజ్ పనిని బాంబే లాబీకి అప్పగించారు. ఓ మధ్యస్థాయి మీడియా సంస్థ కూడా సొంతంగా మనుగడ సాగించలేని స్థితికి చేరుకున్నా… బాహాటంగా ఏమీ అనలేని స్థితి ఏర్పడింది. ఆరోపించడానికి ప్రధాన కారణాలు లేవు. కేవలం ఛానల్స్, పేపర్ల సంఖ్యను చూపి… ఈ రంగంలో గుత్తాధిపత్యం లేదని కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా చేతులు దులుకుపుకుంటోంది. అయితే క్రమంగా మీడియాలో గుత్తాధిపత్యానికి అదే దారి చూపుతోంది.
బార్క్‌పై నిషేధం
గత కొన్ని సంవత్సరాలుగా మీడియా సంస్థలను నయానో భయానో బెదిరించి తనకు అనుకూల వార్తలు వేయించుకున్న మోడీ ప్రభుత్వం ఇపుడు మొత్తం మీడియాను కొన్ని సంస్థల చేతిలోఉంచేలా చర్యలు తీసుకుంటున్నట్లు కన్పిస్తోంది. బార్క్ రేటింగ్స్‌పై ఇప్పటికే అనుమానాలు వచ్చాయి. రేటింగ్స్ వెనుక కోట్ల రూపాయలు చేతులు మారాయన్న ఆరోపణలూ వచ్చాయి. కేసులూ పెట్టారు. కానీ ఏదీ తేల్చలేదు. పెద్ద చేపల్ని వొదిలేశారు. మొత్తాన్ని దేశ వ్యాప్తంగా బార్క్ రేటింగ్స్ శీలంపై అనుమానాలు రేకేత్తించడంలో సక్సెస్ అయ్యారు. బార్క్ను సంస్కరించే పనిో అంటూ ఏకంగా రేటింగ్‌పై నిషేధం విధించారు. గల్ఫ్ యుద్ధం కారణంగా తెచ్చిన నిషేధం త్వరలోనే పోతుందని ఆశించిన మీడియా సంస్థలకు కేంద్రం షాక్ ఇచ్చింది. టీవీ రేటింగ్స్‌కు సంబంధించి కొత్త నిబంధనలను అమల్లోకి తెచ్చింది. అవి అమలు చేస్తే గాని రేటింగ్స్ ఇవ్వడానికి వీల్లేదని చెప్పేసింది. పైగా బార్క్ గుత్తాధిపత్యాన్ని ప్రశ్నించిన కేంద్రం ఇదే రంగంలోకి వస్తాన్న ట్యామ్ రేటింగ్స్ కంపెనీ దరఖాస్తుపై ఇప్పటి వరకు అతీగతీ లేదు. దీంతో ఏప్రిల్ నుంచి న్యూస్, ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ ఎలాంటి రేటింగ్స్ లేకుండా తమ ఇన్వెంటరీని అమ్ముతున్నాయి. అయితే ఎంటర్టైన్మెంట్ టీవీలకు ఓ ఛాన్స్ ఉంది.తమ షోలు, సీరియల్స్ టాక్‌ను బట్టి… ఇది వరకు వచ్చిన రేటింగ్స్‌ను బట్టి యాడ్స్ అమ్మే ఛాన్స్ ఉంది…. న్యూస్‌కు ఇది సాధ్యం కాదు. ముఖ్యంగా జాతీయ, ప్రాంతీయ ఛానల్స్‌లో ఇది మరీ కష్టం. దీంతో ప్రాంతీయ ఛానల్స్ యాడ్స్ కోసం నానా తంటాలు పడాల్సి వస్తోంది. లాబీయింగ్ కోసం ఉన్న ఛానల్స్ సంగతి అటుంచితే… వ్యాపారంగా రంగంలోకి దిగిన వారికి చక్కలు కన్పిస్తున్నాయి. ప్రతి ప్రాంతానికి, పార్టీకి, కులానికి ఛానల్స్ రావడంతో ‘ఇతర ఆదాయ’ మార్గాలు మూసుకుపోయాయి. రాష్ట్ర ప్రభుత్వాల ప్రాపకంపై ఆధారపడాల్సి వస్తోంది. గత్యంతరం లేక బాంబే లాబీకి ఓ మోస్తరు ఛానల్స్ దాసోహం అవుతున్నాయి.
బాంబే లాబీదే…
దేశ మీడియా రంగంలో న్యూస్ బ్రాడ్‌కాస్టర్స్ అండ్ డిజిటల్ అసోసియేషన్ (NBDA)దే పెత్తనం. దేశంలోని ప్రధాన మీడియా సంస్థలన్నీ ఇందులో ఉన్నాయి. రిలయన్స్, అదానీ, ఈనాడు, టైమ్స్, టీవీ18. ఆనంద్ బజార్ పత్రిక, జీ టీవీ, మాతృభూమి,ఇండియా టుడేతో పాటు అన్ని ప్రధాన సంస్థలు ఇందులో మెంబర్స్. 70 ఛానల్స్‌కు చెందిన 27 మంది సభ్యులు ఈ అసోసియేషన్‌లో ఉన్నారు. నిజం చెప్పాలంటే ప్రభుత్వ మెడలు వొంచే శక్తి ఈ అసోసియేషన్‌కు ఉంది. కాని లోపాయికారీగా దేశ మీడియాలో జరుగుతున్న పరిమాణాలన్నీ ఈ సంస్థలకు అనుకూలంగా ఉన్నాయి. దీంతో ఇవి కూడా భజనకే మొగ్గుచూపుతున్నాయి. ప్రింట్, ఛానల్స్, డిజిటల్, కనెక్టెడ్ టీవీ (CTV) మార్కెట్లో వీరిదే గుత్తాధిపత్యం. ప్రభుత్వ విధానాలు వీటికి అనుకూలంగా ఉండటంతో… చిన్న సంస్థల గురించి ఇవి పట్టించుకోవడం మానేశాయి. వీటికి పోటీ కేవలం యూట్యూబ్ మాత్రమే. కనెక్టెడ్ టీవీ మార్కెట్లో నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ వంటివి ఉన్నా… రిలయన్స్ కంపెనీ జియో హాట్‌స్టార్‌దే ఈ మార్కెట్లో రాజ్యం. లీనియర్ టెలివిజన్ అంటే సంప్రదాయ టెలివిజన్ నుంచి చాలా వరకు యాడ్స్ డిజిటల్‌కు వెళుతున్నాయని చాలా మంది అనుకుంటారు. అయితే కనెక్టెడ్ టీవీకే అధికంగా వెళుతున్నాయి. దేశంలో వంద కోట్ల టీవీలు ఉంటే.. అందులో 60 శాతం టీవీల ద్వారా జనం ఇపుడు యూట్యూబ్, యాప్ ద్వారా ఎంటర్టైన్మెంట్, న్యూస్ చూస్తున్నారు. ఓటీటీలు కూడా ఇదే అసోసియేషన్ సభ్యుల చేతిలోఉంది. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, సోని లివ్ వంటివాటితో పోటీ ఉన్నా… జియో హాట్‌స్టార్‌తో పాటు టైమ్స్, ఈనాడు, సన్‌టీవీ వంటి గ్రూప్‌లకు గట్టి ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు కూడా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం బార్క్ రేటింగ్స్‌ను ఆపడంతో చాలా కంపెనీలు తమ యాడ్ బడ్జెట్‌ను డిజిటల్ లేదా కనెక్టెడ్ టీవీ రంగాలకు కేటాయిస్తున్నారు. పరోక్షంగా మీడియా ఆదాయం కేవలం ఎంపిక చేసిన కొన్ని మీడియా సంస్థలకే వెళుతోంది. మరి చిన్న ఛానల్స్.
ఇది కూడా కేరాఫ్ బాంబే
రేటింగ్స్ బ్యాన్‌కు ముందే బాంబేలో రెండు మీడియా లాబీలు ఏర్పడ్డాయి. NBDAకు పోటీగా రిపబ్లిక్ టీవీ యజమాని అర్నబ్ గోస్వామి నాయకత్వంలో
News Broadcasters Federation (NBF) ఏర్పడింది. అధ్యక్షులు మారినా… ఈ ఫెడరేషన్ కర్త, కర్మ, క్రియే అర్నబ్ గోస్వామినే. పెద్ద ఛానల్స్ పోగా… మిగిలిన ఛానల్స్ అన్ని ఈ గుంపులో చేరాయి. 14 భాషలకు చెందిన 400లకుపైగా ఛానల్స్‌కు తాను ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు NBFఅంటోంది. దాదాపు అన్ని రాష్ట్రాల నుంచి ఇందులో ప్రాధాన్యం ఉంది. రేటింగ్స్ లేని సమయంలో ఈ ఫెడరేషన్ కీలక పాత్ర పోషిస్తోందని బెంగళూరుకు చెందిన ఓ మీడియా ప్లానర్ అన్నారు. పెద్ద కంపెనీలతో పాటు చిన్న కంపెనీలతో లాబీ చేయడంలో ఇది ముందుంది. ఫలానా రాష్ట్రంలో ఫలానా ఛానల్స్ యాడ్స్ ఇవ్వమని కంపెనీలకు చెప్పే స్థాయిలో ఈ ఫెడరేషన్ ఉంది. దీని వెనుక ప్రభుత్వ పెద్దలు ఉన్నారన్న ప్రచారంతో కంపెనీలు కూడా సరే అంటున్నాయి. అంటే బాంబే కేంద్రంగా దేశంలోని అన్ని ఛానల్స్‌కు యాడ్స్ పంపిణీ జరుగుతోందన్నమాట. కొత్త నిబంధనలను అమలు చేస్తే కాని…తాను రేటింగ్స్‌కు అనుమతి ఇవ్వనని ప్రభుత్వం అంటోంది. ముఖ్యంగా పండుగ సీజన్లో తీవ్రంగా నష్టపోతున్నామని ఛానల్స్ లబోదిబో అంటున్నాయి. అయినా ప్రభుత్వం నుంచి స్పందన లేదు. దీంతో రూ. 3,500 కోట్ల యాడ్స్ ఇపుడు లాబీలు నిర్ణయించే పరిస్థితి వచ్చింది.
లోకల్… లోకలే…
రేటింగ్స్‌తో యాడ్స్ తెచ్చుకునే రాష్ట్ర స్థాయి ఛానల్స్ ఇపుడు తీవ్ర ఇబ్బందుల్లో పడ్డాయి. ఆయా రాష్ట్రాల్లో తిరుగులేని స్థాయిలో ఉన్న టీవీ9, ఈటీవీ, సన్ టీవీ వంటి సంస్థలు తప్ప ఇతర ఛానల్స్ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. టీవీ9 గ్రూప్‌లో కూడా 60 శాతంపైగా ఆదాయం తెలుగు, కన్నడ ఛానల్స్ నుంచే వస్తోంది. రెండు రాష్ట్రాల్లో ఆ ఛానల్స్ నష్టాల్లో నడుస్తున్నాయి. డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లను బలంగా మార్చుకోవడంలో సక్సెస్ అయిన టీవీ9, ఈటీవీ, సన్ గ్రూప్‌లు… తాజా పరిస్థితులను ఈజీగా తట్టుకుంటున్నాయి. ఛానల్లో వచ్చిన వీడియోలతో యూట్యూబ్‌లో పోస్ట్ చేస్తూ అనుబంధ వ్యాపారంగా చూసిన ఛానల్స్ ఇపుడు ఆర్థికంగా ఇబ్బందుల్లో పడ్డాయి. అలాకాకుండా… ఛానల్‌కు పోటీగా మారో వ్యాపార యూనిట్‌గా భావించి డిజిటల్ సంస్థలను నడిపిన కంపెనీలు ఇపుడు లాభపడుతున్నాయి. భారీ పెట్టుబడితో డిజిటల్లో వచ్చిన టీవీ9 ఇపుడు ఆ విభాగం నుంచి బాగానే సంపాదిస్తోంది. బ్రాండ్ ఇమేజీ ఏర్పడిన తరవాత ఇపుడు సిబ్బంది తొలగించినా… ఆ కంపెనీకి వచ్చిన నష్టం లేదు. ఆ సాహసం ఇతర ఛానల్స్ చేయలేకపోయాయి. తమ కంటెంట్‌ను WAY2NEWSను వాడుకుని రాణిస్తున్నా… పెద్ద కంపెనీలు ఏం చేయలేకపోతున్నాయి. కనీసం వీడియోలతో ఓ ప్లాట్‌ఫామ్ చేసే పని కూడా చేయలేకపోయాయి. మార్కెట్లో మారుతున్న వ్యూహాలకు అనుగునంగా అడ్వర్టయిజ్మెంట్ విభాగంలో మార్పులను కూడా తేలేకపోయాయి. పాతతరాన్ని చాలా ఛానల్స్ వొదిలించుకోలేకపోతున్నాయి. బాంబే టూర్లు, మందు పార్టీలకే 20 శాతం యాడ్ రెవెన్యూ ఖర్చు చేయాల్సి వస్తోంది టీవీ యజమాని వాపోయారు. చాలా మీడియా సంస్థలు డైలీ యాడ్ టార్గెట్‌తో నడిచే పరిస్థితి ఉంది. కాని అలా ఎన్ని ఛానల్స్ చేయగలవు? లీనియర్ టీవీతో పాటు డిజిటల్ మీడియాలో కొత్త తరాన్ని తెస్తున్న ఛానల్స్ కూడా ఇపుడు మోడీ గ్రూప్‌లో రాణిస్తున్నాయి. చంద్రబాబు, రేవంత్ వంటి నేతలు కూడా ప్రభుత్వ సాయంతో ప్రైవేట్ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లకు మద్దతు ఇచ్చే పరిస్థితి ఏర్పడింది. కాని దాన్ని క్యాష్ చేసుకునే స్థితిలోచాలా ఛానల్స్ లేవు. ప్రతినెలా బాంబే లాబీకి సలామ్ కొట్టి తమ ఖాతాలో కొన్ని యాడ్స్ వేయించుకోవడం వినా… ఏమీ చేయలేని స్థితిలో లోకల్ ఛానల్స్ ఉన్నాయి. రేటింగ్స్ విషయంలో చాలా ఛానల్స్ నిలదీస్తుంటే… మరో కమిటీని వేసింది ప్రభుత్వం. కేంద్ర హోం మంత్రి అమిత్ షా నేతృత్వంలోని ఈ కమిటీలో మరో ఇద్దరు మంత్రులు కూడా ఉన్నారు. మొదటిసారి సమావేశం జరిగింది. మళ్ళీ ఎపుడో తెలియదు. టైమ్‌పాస్ కోసమే ఏర్పాటు చేసినట్లు ఉంది ఈ కమిటీ వ్యవహారం. రేటింగ్ వ్యవహారం ఇప్పట్లో తేలేలా లేదు. లోకల్ మీడియా ఈ టెన్షన్లో ఉండగా… ఇపుడు ఏఐ వస్తోంది. ఈ రంగంలో కూడా పోటీ పెరిగే ఛాన్స్ ఉంది. చిత్రమేమిటంటే… సోషల్ మీడియాతో విసిగిపోయిన జనం మళ్ళీ సంప్రదాయ టీవీలను చూస్తున్నారని పలు సర్వేలు చెబుతున్నాయి. కాని వాటిని క్యాష్ చేసుకునే స్థితిలో లోకల్ ఛానల్స్ లేకపోవడం విచిత్రం. తమ పెద్దలనే తమకు శత్రవులుగా మార్చడంలో కేంద్రం సక్సెక్ కావడంతో ఏమీ చేయలేని స్థితిలో ప్రాంతీయ ఛానల్స్ మిగిలాయి. ఏఐ కంటెంట్ మానిటైజేషన్ మొదలైతే… వీటి పరిస్థితి ఏమిటో?
